కాంగ్రెస్, బీఆర్ఎస్ (BRS) పార్టీల మధ్య ‘చర్చల సవాల్’ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు పార్టీల నాయకుల మధ్య తీవ్ర వాదోపవాదాలు, అరెస్టులతో హైడ్రామా నెలకొంది. అవినీతిపై చర్చకు తాము సిద్ధమని ప్రకటించిన బీఆర్ఎస్ నేత హరీష్ రావును ఇతర ముఖ్య నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడంతో రాజధానిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
చర్చకు రావాలంటూ కాంగ్రెస్ మంత్రులకు తానే స్వయంగా ఫోన్ చేశానని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. అయితే హరీష్ రావు ఫోన్ చేసినప్పటికీ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మరియు కాంగ్రెస్ నేత అజారుద్దీన్ లు స్పందించలేదు. మాతో చర్చలకు రావడానికి ఎందుకు అడ్డుకుంటున్నారు? ,వాళ్ల బండారం అంతా బయటపెడతాననే భయంతోనే నన్ను అడ్డుకుంటున్నారు. అవినీతి జరిగింది కాబట్టే చర్చలకు రాకుండా మమ్మల్ని అరెస్ట్ చేయించి పారిపోతున్నారు అని హరీష్ రావు మండిపడ్డారు.
తాము చర్చకు సిద్ధమని చెబుతూనే కాంగ్రెస్ మంత్రులు గన్ పార్క్ నుండి పారిపోయారని బీఆర్ఎస్ ఆరోపించింది. చర్చలకు వస్తున్న హరీష్ రావును, ఇతర బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని విలేఖరులు ప్రశ్నించగా.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పొంతన లేని సమాధానాలు చెప్పారు. కేసీఆర్ వస్తేనే మేము చర్చలు జరుపుతాము, కావాలంటే అసెంబ్లీకి రండి అక్కడ చర్చిద్దాం అంటూ కాంగ్రెస్ మంత్రులు అసలు చర్చ నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు తీరుపై హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జూపల్లి.. నిన్న నువ్వే కదా తెలంగాణ భవన్‌కు వస్తానని అన్నావు.. మళ్లీ ఇప్పుడు గన్ పార్క్ వద్ద ఈ డ్రామాలు ఏంటి? ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌కు వస్తానని చెప్పి ఇప్పుడు ఎందుకు తోక ముడిచావు? దమ్ముంటే తెలంగాణ భవన్‌కు రా.. అక్కడ కేటీఆర్ నీ కోసం ఎదురుచూస్తున్నారు అంటూ హరీష్ రావు సవాల్ విసిరారు.
బీఆర్ఎస్ నాయకుల ఆందోళనతో ఉద్రిక్తత పెరగడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరియు ఇతర బీఆర్ఎస్ నాయకులను దాదాపు గంటన్నర పాటు డీసీఎం (DCM) వ్యాన్‌లో నగరమంతా తిప్పారు. చివరకు వారిని కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించి, స్టేషన్ వెలుపల ఎండలో కూర్చోబెట్టడంపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

