సిద్దిపేట జిల్లా దుబ్బాక రెడ్డి సంఘంలో మంత్రి హరీశ్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..ఈ ఎన్నికల్లో పని మంతులను, గుణవంతులను, సమర్థులను ఎన్నుకోవాలి. తెలంగాణ ప్రజలే హై కమాండ్ గా టిఆర్ఎస్ పని చేస్తుందన్నారు. సొంత మనుషులు కావాలా.. పరాయి మనుషులు కావాలా ? రైతుబందులు కావాలా ? రాబందులు కావాలా ? అని మంత్రి ప్రశ్నించారు. పరాయి నాయకులు.. కిరాయి మనుషులు ఈ రోజుతో వెళ్ళిపోతారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఇంటికి రాష్ట్ర సర్కారు ఐదు సంక్షేమ పథకాలు పోతున్నాయి. అయినా అభివృద్ధి జరగలేదనడం ఏమనాలి ? ఆ దేవుడు కూడా క్షమించడు అని విమర్శించారు.
ముత్యంరెడ్డి కుటుంబం కూడా టిఆర్ఎస్ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. గోదావరి నీళ్లు దుబ్బాక కు రాలేదా ?.. దేశంలో 17 బీజేపీ రాష్ట్రాలు, 5 కాంగ్రెస్ రాష్ట్రాల్లో కేసీఆర్ ఇస్తున్న సంక్షేమ పథకాలు ఇస్తున్నారా ? చెప్పాలి. కాంగ్రెస్, బీజేపీ చేసిన అభివృద్ధి ఏమిటి ? ఎందుకు మీకు ఓటు వేయాలి. కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదా ? గుండెలపై చెయ్యి వేసుకుని చెప్పాలి అని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు కూడా ఓటేసే ముందు ఆలోచించి వేయండి అని మంత్రి కోరారు. దుబ్బాకలో పెద్ద మెజారిటీతో సుజాతక్కను గెలిపించి సీఎం కేసీఆర్ మనస్సు గెలుచుకుందాం.
డబ్బులు బీజేపీ నాయకులవే దొరుకుతున్నాయి. హైదరాబాద్ లో అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి. ఇవ్వాళ, రేపు బీజేపీ మరో యాక్షన్ ప్రారంభం కావచ్చు. వాళ్లే అంగీలాగులు చింపుకొని నెపం మా పైన వేసినా వేస్తారు. ఎన్నికల కోసం వారు హై డ్రామా చేసే అవకాశం ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చిదపురుగులను ఏరిపారేయాలి. ఈ రోజు, రేపు సోషల్ మీడియాలో వచ్చే వాటిని నమ్మవద్దని ప్రజలకు మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు.