తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకుంటున్న చంద్రబాబును తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు మంత్రి హరీష్ రావు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన హరీష్..చంద్రబాబు వైఖరిని ఎండగట్టారు. చంద్రబాబు తుమిళ్లకు అడ్డుపడి ఇది అక్రమ ప్రాజెక్టు అని కేంద్రానికి లేఖరాస్తే పది నెలల్లోనే తుమ్మిళ్ల లిఫ్ట్ ద్వారా నీళ్లిచ్చిన చరిత్ర కేసీఆర్‌ది అన్నారు.
తుంగభద్ర నుంచి 40 టీఎంసీల నీటిని తీసుకుపోయేందుకు, నాగల్ దిన్నె లిఫ్ట్ ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. సుంకేశులకు నీళ్లు రాకపోతే తుమ్మిళ్లకు నీళ్లు రావని… నాగల్ దిన్నె లిఫ్ట్ ఆగాలంటే చంద్రబాబును ఓడగొట్టాలన్నారు.
మహాకూటమిలో ఉత్తమ్ ఉనికి పోయింది. మహాకూటమి తెరపై కనబడుతున్నది చంద్రబాబు, బాలకృష్ణ మాత్రమే. చంద్రబాబు ముఖంలో చంద్రముఖి కనబడుతుందని… ఈ చంద్రముఖి మాకొద్దని తెలంగాణ ప్రజలు అంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ జిల్లాను దత్తత తీసుకున్న చంద్రబాబు మనకు మాటలు చెప్పి.. నీళ్లను ఏపీకి తీసుకుపోయిండని ఆరోపించారు.
తెలంగాణ వస్తే ఏమొస్తదని కొంతమంది అన్నారని వారికి తుమ్మిళ్ల, ఎండిపోయిన ఆర్డీఎస్ కాల్వల్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ సీఎం కాకపోతే తుమ్మిళ్ల లిఫ్ట్ వచ్చేదా? ఆర్డీఎస్ కాల్వల్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కేదా? ప్రశ్నించారు.