రంగనాయక సాగర్ ప్రధాన కుడి, ఎడమ కాల్వల పరిధిలోని రైతులు నీటిని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కోరారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని మంత్రి నివాసంలో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కుడి, ఎడమ కాలువల ద్వారా గ్రామాల వారీగా చెరువులు, కుంటలు, వాగులు నింపనున్న అంశాలపై సుదీర్ఘంగా సమీక్షా సమావేశం జరిపారు.
ప్రధాన కుడి, ఎడమ కాలువల తూములకు యుద్ధప్రాతిపదికన గేట్లు బిగించాలని ఇరిగేషన్ అధికారులకు మంత్రి ఆదేశించారు. చివరి ఆయకట్టు రైతులకు సాగు నీరందేలా రైతులు సహకరించేలా ఆయా మండల తహశీల్దార్లు, స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని మంత్రి సూచించారు.
స్థానిక రైతుల అవసరాలను గుర్తించి నీటి విడుదలలో హెచ్చతుగ్గులు చేయాలని ఇరిగేషన్ అధికారులకు మంత్రి ఆదేశించారు. ఆన్ అండ్ ఆఫ్ పద్దతి ద్వారా నీటిని విడుదల చేస్తుండడంతో నీటి వృథా తగ్గడంతో పాటు పంట దిగుబడి కూడ పెరిగిందని., రైతులు అవసరమున్నంత వరకు నీళ్లు వాడుకుని తూములను మూసివేసేలా చొరవ చూపాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు మంత్రి హితవు పలికారు.
ఇప్పుడు పొదుపు చేసిన నీరే ఎప్పటికీ తాగునీటి, సాగునీటికి కూడా ఉపయోగపడుతుందని., నీటి పొదుపు పై రైతులకు అవగాహన సదస్సులను త్వరలోనే నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. మైనర్, సబ్ మైనర్ కాల్వలు పూర్తి చేసుకుని, వాటి ద్వారా చెరువులు, కుంటలకు నీళ్లు అందించేలా మైనర్ ఇరిగేషన్ అధికారులు చేయాలని మంత్రి సూచించారు. కుడి, ఎడమ ప్రధాన కాలువకు సిమెంట్ – కాంక్రీటు లైనింగ్ అసంపూర్తి పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులకు మంత్రి ఆదేశించారు.