చంద్రబాబుకు హరీష్‌ బహిరంగ లేఖ

280
harish rao
- Advertisement -

తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన హరీష్‌ ఉసరవెల్లి సైతం చంద్రబాబును చూసి సిగ్గుపడుతుందని మండిపడ్డారు. ఈ మేరకు చంద్రబాబుకు 19 అంశాలతో లేఖ రాస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను ఎందుకు అడ్డుకుంటున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీకృష్ణ కమిటీకి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతోందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తికాకుండా కేంద్రానికి లేఖ రాసింది నిజం కాదా అని ప్రశ్నించారు.

తెలంగాణ ప్రజలను వంచించిన చంద్రబాబుతో కాంగ్రెస్ ఏ విధంగా పొత్తు పెట్టుకుంటుందని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడం ద్వారా చంద్రబాబు ఏం సాధిస్తారని దుయ్యబట్టారు హరీష్. తెలంగాణలో రాజకీయ అస్థిరత సృష్టించడానికి చంద్రబాబు ప్రయత్నించారని ఆరోపించారు. న్యాయపరంగా రావాల్సిన విద్యుత్‌ను రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చినా అక్రమమే అని పనులు నిలిపివేయాలని కేంద్రానికి,కృష్ణా నది యాజమాన్య బోర్డుకు లేఖ రాయలేదా అని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా పాలేరుకు భక్తరామదాసు ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందిస్తే దానిని అడ్డుకునేందుకు లేఖలు రాశారని గుర్తుచేశారు. మహాకూటమి అభ్యర్థి పాలేరులో ఏ విధంగా పోటీ చేస్తారని ప్రశ్నించారు.

ఏపీ ప్రయోజనాల కోసమే చంద్రబాబు తెలంగాణలో పోటీ చేస్తున్నారని హరీష్ ధ్వజమెత్తారు. ఆలంపూర్‌ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు తుమ్మిళ్ల ఎత్తిపోథల పథకాన్ని చేపడితే దానిని అడ్డుకునేందుకు కేంద్రానికి లేఖలు రాశారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలను వంచించిన చంద్రబాబుతో కాంగ్రెస్ ఏవిధంగా పొత్తు పెట్టుకుంటుందన్నారు.

- Advertisement -