తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు తమ పర్యటనలు, సభలతో స్పీడప్ అయితుంటే… రేసు గుర్రాల్లాగా అధికార టీఆర్ఎస్‌లో కేటీఆర్, హరీష్ రావులు వరుసగా పర్యటనలతో హోరేత్తిస్తున్నారు. సీఎం కేసీఆర్ డైరెక్షన్‌లో ఇద్దరు నేతలు ప్రతిపక్ష నేతల కన్నా జోరుగా జిల్లాల పర్యటనలతో, అభివృద్ధి కార్యక్రమాలతో బిజీబిజీగా ఉంటున్నారు. మంత్రి హరీష్ రావు ఆరోగ్య మంత్రి అయ్యాక జిల్లా పర్యటనలు బాగా పెరిగాయి. అధికార కార్యక్రమాలతో పాటు తను వెళ్లిన ప్రాంతాల్లో పార్టీ నేతలను కూడా కలుస్తూ క్యాడర్‌లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలున్నారా… ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నారా అన్నది చూడకుండా ఓపెనింగ్ లు, శంకుస్థాపనలతో జిల్లాలను చుట్టేస్తున్నారు హరీష్.
ఇక కేటీఆర్ కూడా హైదరాబాద్ తో పాటు జిల్లా పర్యటనలను ముమ్మరం చేశారు. గతంలో ఎక్కువగా హైదరాబాద్ కేంద్రంగా బిజీగా ఉండే కేటీఆర్, ఇప్పుడు జిల్లా పర్యటనలను మొదలుపెట్టారు. జిల్లా పార్టీ నేతలతో పాటు తాను ఎక్కడకు వెళ్లినా స్థానిక నేతలను కలవటం, పార్టీలో చేరికలను ప్రోత్సహించటం, స్థానికంగా టీఆర్ఎస్ ను టార్గెట్ చేసే ప్రతిపక్ష పార్టీల నేతలపై ఎదురుదాడి చేయటం కేటీఆర్ షెడ్యూల్ లో భాగం అయిపోయాయి.
జనాల్లో ఉండాల్సిన ప్రతిపక్ష నేతలు హైదరాబాద్ లో ఉంటే వారి నాయకత్వం జనంలోకి వెళ్లండని హెచ్చరిస్తుండగా, అధికారంలో ఉన్నా జనం నుండి వచ్చిన నేతలు కావటంతో జనాల్లోకి ఒకరు చెప్పే పనిలేకుండానే వెళ్తున్నారంటూ టీఆర్ఎస్ క్యాడర్ చర్చించుకుంటుంది. పైగా కేటీఆర్-హరీష్ లు ప్రభుత్వంతో పాటు పార్టీకి కూడా పనిచేస్తుండటం ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందాన్ని నింపుతుంది. వీరికి తోడు లేటుగా అయిన లెటెస్టుగా కేసీఆర్ రంగంలోకి దిగితే వార్ వన్ సైడే అంటూ టీఆర్ఎస్ నేతలు ఖుషీ ఖుషీగా ఉన్నారు.