కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు- మంత్రి హరీష్‌

65
- Advertisement -

శుక్రవారం నాచారంలోని స్టేట్ ఫుడ్ లాబొరేటరీ ప్రాంగణంలో 2.4 కోట్ల విలువ చేసే 4 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ బస్సులు, రూ. 10 కోట్లతో అత్యాధునిక పరికరాలతో అప్ గ్రేడ్ చేసిన ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌ను రాష్ట్ర ఆర్థిక,ఆరోగ్య శాఖల మంత్రి హరీష్‌ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, ఐపీఎం డైరెక్టర్ శంకర్, స్థానిక కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. బెవరేజేస్, మిల్క్, చిరు ధాన్యాల ఉత్పత్తులు, నూనెలు, మసాల దినుసులు, స్వీట్స్, రెడీ మేడ్ ఫుడ్, ఇతర విభాగాల ల్యాబ్‌ను మంత్రి పరిశీలించారు. పరీక్షల విధానం, కల్తీ జరిగే తీరు పట్ల అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి.

ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ మాట్లాడుతూ.. కోట్లాది మంది ప్రజల ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. కల్తీకి పాల్పడే వారి పట్ల అవసరమైన చర్యలు తీసుకోవాలి. ప్రజలకు నాణ్యమైన అహర పదార్థాలు అందేలా చేయడంలో ప్రభుత్వం నుండి అన్ని రకాల సహకారం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తాము. ఫుడ్ సేఫ్టీ అధికారులు చిత్తశుద్దితో పని చేయాలి. కల్తీకి పాల్పడిన వారి పట్ల అధికారులు కఠినంగా వ్యవహరించాలి. అధికారులు నెలవారీ రిపోర్టులు సిద్దం చేసి పంపించాలని మంత్రి ఆదేశించారు.

సమీక్ష అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కల్తీ చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాము. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టర్ ల సంఖ్యను పెంచాము. రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేయడంతో పాటు, విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తాము. జి.హెచ్.ఎం.సి లో ఇప్పుడున్న బస్సుకు అదనంగా వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలో ఒక్కో బస్సును అందుబాటులో ఉంటాయి. ఆయా జిల్లాల పరిధిలో తిరుగుతూ, ఆహార కల్తీ గుర్తించడం జరుగుతుంది, బస్సుల ద్వారా ఆహార కల్తీ పట్ల ప్రజల్ని అప్రమత్తం చేసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సర్ప్రైజ్ విజిట్స్ చేసేందుకు ప్రత్యేకంగా టాస్క్ ఫోర్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాము. పిర్యాదులు రాగానే వీరు వెళ్లి సరైన చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వం ఆహార కల్తీని అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నది, ప్రజలు సైతం ఎక్కడైనా కల్తీ జరిగినట్లు సమాచారం ఉంటే.. 040 21111111 నెంబర్ కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి, వెంటనే అధికారులు తగిన చర్యలు తీసుకుంటారు అని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -