పాలమూరు జిల్లాకు మాజీ సీఎం కేసీఆర్ నీళ్లు ఇవ్వలేదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్, టీడీపీ 30 ఏళ్ల పాలనలో పాలమూరు ప్రాంతానికి కేవలం 30 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించారని, కేసీఆర్ హయాంలో మాత్రం 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామని పేర్కొన్నారు. పాలమూరు ప్రాజెక్టు నిర్మాణం, అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం రూ.28 వేల కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. పాలమూరు బిడ్డనని చెప్పుకునే ముఖ్యమంత్రి.. ఇప్పుడు అదే ప్రాంతంలోని రైతులకు క్రాప్ హాలిడే ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారని విమర్శించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం పాలమూరు రైతులకు సాగునీరు అందించేందుకు అనేక చర్యలు చేపట్టిందని, లక్షల ఎకరాలకు నీరందించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసిందని అన్నారు.
చంద్రబాబు జీవోపై ఎందుకు ఫిర్యాదు చేయలేదు?
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2024లో ఏపీ సీఎం చంద్రబాబు జీవో జారీ చేసి, సుమారు 750 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పం నియోజకవర్గానికి నీటిని తరలించుకుపోయారని హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా జీవో జారీ అయినప్పటికీ ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఆ జీవోలపై ఎందుకు ఫిర్యాదు చేయలేదని నిలదీశారు.
చంద్రబాబుకు గురుదక్షిణలో భాగంగానే తెలంగాణ నీటి ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారా? అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఒకవైపు పాలమూరు బిడ్డనని చెప్పుకుంటూ, మరోవైపు అదే ప్రాంతానికి సాగునీరు అందించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్, టీడీపీ పాలనలో పాలమూరు ప్రాంతం సాగునీటి కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందని హరీష్ రావు అన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాతే సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి, రైతులకు నీరందించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.
Also Read:Nvidia:జెన్సన్ హువాంగ్ రీ ఎంట్రీ..

