ప్రధాని మోదీ హైదరాబాద్‌కు వచ్చి ఏం తెచ్చారని అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేయడానికి వచ్చినట్ల లేదు కానీ కడుపులోని విషం కక్కడానికి వచ్చినట్లు ఉందని అన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడిన ప్రతి మాట సత్య దూరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒక ప్రధానిగా ఇన్ని అబద్ధాలు ఆడడం ఆయనకే చెల్లిందన్నారు.
ఆసరా పెన్షన్, రైతు బంధు వంటివి నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతున్నాయని అన్నారు. తన వల్లే డీబీటీ మొదలైనట్టు అనడం పచ్చి అబద్ధమన్నారు. ఇందులో గొప్ప చెప్పుకోవాల్సింది ఏముంది? అని ప్రశ్నించారు. ఐటీఐఆర్‌ను బెంగళూరుకు తరలించారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన వెంటనే గుజరాత్‌లో అర్బిట్రేషన్ సెంటర్ పెట్టారు. తెలంగాణ ధాన్యాన్ని కొనకుండా రైతుల కంట కన్నీరు పెట్టించారు. ఇవన్నీ చేసింది మీ ప్రభుత్వం కాదా..? అని మోదీని ఉద్దేశించి హరీశ్‌రావు ప్రశ్నించారు.
రాష్ట్రానికి రావాల్సిన గిరిజన యూనివర్సిటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, జాతీయ హోదా వంటివి ఇవ్వకుండా కేంద్రం తెలంగాణకు ఎలాంటి సహకారం అందించడం లేదు అని హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సహకారం అందించడం లేదని మోదీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని హరీశ్‌రావు అన్నారు.
ఇవి కూడా చదవండి…