పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చారిత్రక నేపథ్యంలో పవన్ చేస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీ మొగల్ పాలనా కాలం నాటి కథాకథనాలతో రాబోతుంది. ఇందులో వజ్రాల దొంగ పాత్రలో పవన్ నటిస్తున్నాడు. ఆయన సరసన నాయికగా నిధి అగర్వాల్ కనిపించనుంది. ఈ సినిమా కోసం ఆ కాలంనాటి పరిస్థితులకు సరిపోయేలా భారీ సెట్లు వేస్తున్నారు. అందుకోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారట.
కరోనా నేపథ్యంలో ప్రస్తుతం సినిమా షూటింగ్ నిలిచిపోయింది. కరోనా పరిస్థితులు చక్కబడగానే తిరిగి షూటింగు మొదలవుతుందని అంటున్నారు. ఇక ఈ సినిమా నుంచి త్వరలో టీజర్ వచ్చే అవకాశాలు ఉన్నాయనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. అయితే పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా, సెప్టెంబర్ 2వ తేదీన టీజర్ ను రిలీజ్ చేయాలనే ఉద్దేశంతోనే దర్శక నిర్మాతలు ఉన్నారట. అందువలన ఈ మధ్యలో టీజర్ వచ్చే అవకాశం లేదనే అంటున్నారు.