హార్ధిక్‌కు రెండేళ్ల జైలు శిక్ష …

176
Hardik Patel

పటేళ్ల రిజర్వేషన్ల కోసం అటు కేంద్రాన్ని ఇటు గుజరాత్‌ ప్రభుత్వాన్ని ముచ్చెమటలు పట్టించిన పటేదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి (పీఏఏఎస్‌) హార్దిక్‌ పటేల్‌కు గట్టిషాక్ తగిలింది. 2015లో జరిగిన అల్లర్ల కేసులో హార్ధిక్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ అహ్మదాబాద్ విస్‌నగర్ కోర్టు తీర్పు వెలువరించింది.

హార్ధిక్‌తో పాటు లాల్జీ పటేల్,ఏకే పటేల్‌లకు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 50 వేల జరిమానా విధించింది. పటీదార్ ఉద్యమ సమయంలో బీజేపీ ఎమ్మెల్యే రుషికేష్‌ ఆఫీస్‌ను ఆ సంస్థ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఈ కేసులో హార్దిక్‌తోపాటు పలువురిపై దాడి, అల్లర్లు, నేరపూరిత కుట్ర తదితర కేసులను నమోదు చేశారు. హార్ధిక్‌ అరెస్టు కావడం తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. అంతేగాదు కొన్ని నెలల పాటు మెహసానా జిల్లాలోకి ప్రవేశించకుండా కోర్టు ఆంక్షలు విధించింది.

దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఈ కేసులో తీర్పు వెలువరించిన న్యాయస్ధానం హార్ధిక్‌కు శిక్ష ఖరారు చేసింది. అయితే పై కోర్టులో అప్పీలు చేసుకునే వెసులుబాటు కల్పించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో తన మద్దతు దారులతో సమావేశమైన హార్దిక్ ఎలాంటి ఆందోళనలకు దిగొద్దని సూచించారు.