గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పట్టేదార్ నేత హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పట్టేదార్ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన హార్దిక్ పటేల్ 2019లో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. గత కొంత కాలంగా గుజరాత్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటల కారణంగా పార్టీపై అసహనంతో ఉన్న హార్ధిక్ పటేల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్న విషయాన్ని ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వార తెలిపారు.
గుజరాతీ ప్రజలు తన నిర్ణయాన్ని అంగీకరిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ట్విట్టర్ ద్వారా అందించారు. భవిష్యత్తులో తాను తీసుకునే నిర్ణయాలు గుజరాతీల అభివృద్దికి అనుకూలంగా ఉపయోగపడుతాయని ఆశించారు.