1940 జనవరి 10న అగస్టీన్ జొసెఫ్, ఆలిస్ కుట్టి అనే రోమెన్ కేథలిక్ దంపతులకు కేరళ రాష్ట్రంలో ఫోర్ట్ కొచి గ్రామంలో ఏసుదాసు జన్మించారు. ఆయన తండ్రి మలయాళ శాస్త్రీయ సంగీత విద్వాంసులు, కళాకారులు కూడా. దీంతో యేసుదాసు బాల్యం నుంచే శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటూ అదే తన జీవిత గమ్యంగా చేసుకుని ఆర్.ఎల్.వి మ్యూజిక్ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు.
1961లో ‘కాల్ పడగల్’ అనే మలయాళ చిత్రం ద్వారా సినీపరిశ్రమకు పరిచయమైన ఆయన ‘మదనకామరాజు’ చిత్రం కోసం తెలుగులో తొలిసారిగా పాడారు. అప్పటి నుంచి తన గాన మాధుర్యంతో అందరి హృదయాలను ఆయన నిత్యం అభిషేకిస్తూనే వున్నారు.
ఆయన పాడిన పాటల్లోని హైలైట్స్..
‘దేవుడే ఇచ్చాడు వీధి ఒక్కటి’ ( అంతులేని కథ) …
‘ఎవరమ్మా ఎవరమ్మా ఈ కొమ్మ'( జే గంటలు) …
‘ఎవ్వరిదీ ఈ పిలుపు’ (మానసవీణ)
‘సుక్కల్లే తోచావే’ ( నిరీక్షణ) …
‘మా పాపాలు తొలగించు దీపాలు నీవే’ (శ్రీ షిర్డీ సాయిబాబా మహాత్మ్యం ) …
‘గాలివానలో’ (స్వయంవరం) …
‘ఆకాశ దేశాన’ (మేఘసందేశం ) …
‘మరిచిపో నేస్తమా’ ( జీవన పోరాటం) …
‘స్వరరాగగంగా ప్రవాహమే’ ( సరిగమలు) …
‘కదిలే కాలమా కాసేపు ఆగవమ్మ'( పెదరాయుడు) ఇలా ఎన్నో జనరంజకమైన పాటలు ఆయన స్వరంలో నుంచి తేనె ప్రవాహాలుగా వెలువడుతూనే ఉన్నాయి.
16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడిన గాన గంధర్వుడు ఏసుదాసు. 1975లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, 2002లో పద్మవిభూషణ్ బిరుదుతో ఆయన్ను గౌరవించారు.జాతీయ ఉత్తమ గాయకుడి అవార్డు అత్యధికంగా ఏడుసార్లు అందుకున్న ఏకైక వ్యక్తి ఆయనే. కేరళ ప్రభుత్వం నుంచి 24 సార్లు ఉత్తమ గాయకుడి అవార్డు సొంతం చేసుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి 8 సార్లు, కర్ణాటక ప్రభుత్వం నుంచి ఐదు సార్లు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 6 సార్లు, పశ్చిమ్‌బంగా ప్రభుత్వం నుంచి ఒకసారి ఆయన ఉత్తమ గాయకుడి అవార్డులు అందుకున్నారు.
ఏసుదాసు పాడిన భక్తి గీతాల్లో అయ్యప్పస్వామి భక్తి గీతాలకు ఓ ప్రత్యేకత వుంది. ముఖ్యంగా ఆయన పాడిన ‘హరిహరాసనం’ పాట కోట్లాది అయ్యప్ప భక్తులు నిత్యం స్మరిస్తూనే వుంటారు … తన్మయత్వంతో తరిస్తూనే ఉంటారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటు ఆయనకు గ్రేట్ తెలంగాణ.కామ్ జన్మదిన శుభాకాక్షలు తెలియజేస్తోంది