సీనియర్ నటి శారద తెలుగు, మలయాళ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.. ఈరోజు శారద పుట్టిన రోజు. 1945 జూన్ 25న గుంటూరు జిల్లా, తెనాలిలో జన్మించిన శారద అసలు పేరు సరస్వతిదేవి. శారద ‘కన్యాశుల్కం’ సినిమాతో బాలనటిగా సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఆమె మూడు సార్లు ఊర్వశి అవార్డును అందుకుంది అందుకే ఆమె ఊర్వశి శారదగా పేరు పొందింది. తెలుగులో బాలనటిగానే భలా అనిపించి, నాయికగా అంతగా రాణించలేకపోతున్న సమయంలో మలయాళ చిత్రసీమలో శారద జయకేతం ఎగురవేశారు. అక్కడ తులాభారం, స్వయంవరం చిత్రాలతో జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా ఊర్వశి శారద తన సత్తా చాటింది.
తెలుగులో నిమజ్జనంతో మూడోసారి జాతీయ అవార్డు అందుకున్న ఆమె నాటి మేటి హీరోల అందరి సరసన నాయికగా నటించి మురిపించారు. ఒకప్పుడు శోకరసపాత్రలకు పేరుగాంచిన శారద..తర్వాత రోజుల్లో రౌద్రరస పోషణలోనూ తనకుతానే సాటి అనిపించారు. ఆపైన అత్త పాత్రలతో కామెడీని పండించారు. క్యారెక్టర్ యాక్టర్‌గా తనదైన బాణి పలికిస్తూ సాగిన శారద.. తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి తెనాలి నుంచి లోక్‌సభకు ఎన్నిక అయ్యారు. తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేస్తూ ముందుకు సాగుతున్న శారద మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుందాం..