హ్యాపీ బర్త్ డే…పూరి జగన్నాథ్

317
puri

కమర్షియల్ సినిమాకి త‌న‌దైన మార్క్‌, మీనింగ్ ఇచ్చిన ఏకైక దర్శకుడు పూరి జ‌గ‌న్నాథ్‌. సినిమా సినిమాకి వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ..తనదైన డైలాగ్‌లతో మాస్‌ ప్రేక్షకులను కట్టిపడేయగల నేర్పరి. హీరో ఎవరైన వేగంగా సినిమాలు పూర్తి చేస్తూ స్పీడ్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు. సంఘంలో అరాచ‌కాల్ని ప్ర‌శ్నిస్తూ.. పూరి సినిమాల్లో క‌థానాయ‌కుడు వేసే ప్ర‌తి పంచ్ డైలాగ్‌ హైలెవ‌ల్‌ని ట‌చ్ చేస్తుంది. క్లాస్‌- మాస్ అనే తేడా లేకుండా త‌న‌దైన శైలి డైలాగుల‌తో మెప్పించిన ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్‌. ఇవాళ పూరి జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా greattelangaana.com శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

తొలిసినిమా ‘బద్రి’ మొదలు మొన్నటి ‘పైసా వసూల్‌’ వరకు పూరి తీరు అలాగే సాగింది. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన దగ్గరి నుంచి నుంచీ వెరైటీ చూపించాలనే తపిస్తున్నారు పూరి జగన్నాథ్… తొలి సినిమా ‘బద్రి’లోనే తనదైన మార్కును ప్రదర్శించిన పూరి ఆ తరువాత సాగించిన ప్రయాణం కూడా జనాన్ని విశేషంగా ఆకట్టుకుంది.మాస్ మసాలాలు తనదైన రీతిలో నూరి తెలుగువారిని అలరించారు పూరి. చిత్రీకరణలో పెరిగిన వేగం, ఆయన అతి తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు తీసేలా చేసింది… ఈ తరం దర్శకుల్లో అంత స్పీడ్ ప్రదర్శిస్తున్నవారెవరూ లేరు.

నువ్వు నంద అయితే నేను బద్రి,.. బద్రినాథ్! అంటూ ఈగోయిస్టుని ప‌రిచ‌యం చేసినా, కమీషనర్ కూతుళ్లు పెళ్లి చేసుకోరా..మొగుళ్లు రారా! అంటూ వెటకారమాడినా పూరికే చెల్లింది. ఎవ‌డు కొడితే దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు! అంటూ పోకిరి డైలాగులు చెప్పినా, ఇలా రౌండ‌ప్ చేసి క‌న్ఫ్యూజ్‌చేయొద్దు.. క‌న్ఫ్యూజ‌న్‌లో ఎక్కువ కొట్టేస్తా! అంటూ బిజినెస్‌మేన్‌లోని మాఫియా స్టైల్ ఆవిష్క‌రించినా.. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే .. ఎయిమ్ ఫ‌ర్ లెవంత్ మైల్‌..! అంటూ పూరి చెప్పించిన డైలాగ్‌లను ఇప్పటికి ఎవరు మర్చిపోలేరు.

బాలయ్యతో పైసా వసూల్‌ అంటూ సరికొత్తగా చూపించిన పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో కలిసి ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమా కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడింది. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకానుంది.