బాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా చక్రం తిప్పుతున్న హీరోయిన్ దీపికా పదుకోన్. ఒక్క బాలీవుడ్ లోనే కాదు హాలీవుడ్ లో కూడా తన సత్తాచాటేందుకు త్రిపుల్ ఎక్స్ సిరీస్ మూవీతో హాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతోంది. త్వరలోనే ఈసినిమా రిలీజ్ కానుంది. బాలీవుడ్ సొట్టబుగ్గల సుందరిగా పేరు తెచ్చుకున్న దీపికా 2007లో ఐశ్వర్య అనే కన్నడ మూవీతో సినీ కెరీర్ ను ప్రారంభించింది. ఆతర్వాత రెండో సినిమాకే బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తో నటించే గొప్ప ఛాన్స్ కొట్టేసింది. దర్శకురాలు ఫరా ఖాన్ దీపికను షారుక్‌కి జంటగా ‘ఓం శాంతి ఓం’ సినిమాలో అవకాశం ఇచ్చారు. బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాతో దీపిక పాపులర్ అయింది. ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అందుకొంది. అక్కడి నుంచి దీపికకు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. ఒక్కో సినిమాకు తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటూ అంచలంచెలుగా ఎదిగింది. నేటితో 31వ వసంతంలోకి అడుగుపెడుకున్న దీపికా గురించి మరిన్ని విషయాలు మీకోసం..
వరుసగా లవ్ ఆజ్ కల్, లఫంగే పరిందే, బచ్‌నా యే హసీనో, హౌస్‌ఫుల్, కాక్‌టెయిల్, యేజవానీ హై దివానీ, చెన్నై ఎక్స్‌ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్ చిత్రాల్లో నటించింది. మరో విషయమేంటంటే.. దీపిక ఇప్పటివరకు నటించిన సినిమాల్లో సగానికి సగం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరినవే. 2015 దీపికకు ఎన్నో జ్ఞాపకాలను, విజయాలను ఇచ్చింది. బాజీరావ్ మస్తానీ, పీకూ సినిమాలతో దీపిక పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. అందం, అభినయం, అంతకుమించి అద్భుతమైన నటన దీపికా ఉన్నతమైన కెరీర్ కు బాటలు వేసింది. ప్రజెంట్ బీటౌన్ లో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ దీపికానే కావడం గమనర్షం.
దీపిక పుట్టింది డెన్మార్క్‌లోని కోపెన్‌హాగెన్‌లో. ఆమె తండ్రి ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాశ్ పదుకొణె. దీపికకి 11 నెలల వయసున్నప్పుడు కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. తండ్రి లాగే దీపిక కూడా అథ్లెట్. జాతీయస్థాయి ఛాంపియన్‌షిప్ పోటీల్లోనూ పాల్గొంది. చాలా మందికి తెలీని విషయమేంటంటే.. దీపిక బాడ్మింటనే కాదు రాష్ట్రస్థాయి బేస్‌బాల్ క్రీడాకారిణి కూడా. కానీ మోడలింగ్‌పై ఆసక్తితో క్రీడలకు స్వస్తి చెప్పింది. అలా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన దీపిక చాలా ప్రకటనల్లో నటించింది. కానీ దీపికకి మోడల్‌గా పేరుతెచ్చింది మాత్రం లిరిల్ ఆరెంజ్ యాడ్. ఈ యాడ్‌తో దీపిక ఎంత పాపులర్ అయిందంటే ప్రముఖ కింగ్‌ఫిషర్ క్యాలెండర్ గర్ల్‌గా దీపిక స్థానం దక్కించుకుంది. 2005 ‘మోడల్ ఆఫ్ ది ఇయర్’గా అవార్డు అందుకొంది.
దీపిక ఎక్కడుంటే అక్కడ ఆనందమే. ఆమెని చూస్తే ఆ కళ్లలో ఆ నవ్వులో ఏదో తెలీని ప్రశాంతత. కానీ మనముందు కనిపిస్తున్న దీపిక వేరు. కొన్నేళ్ల క్రితం.. ఓ రోజు తెల్లవారుజామున దీపిక ఆమె పడుకున్న మంచం మీదనుంచి లేచి కూర్చుని ఒక్కసారిగా కుమిలిపోయి ఏడుస్తోంది. అది చూసిన తల్లి ఉజ్జల వెంటనే దీపిక వద్దకు వెళ్లి ‘కెరీర్ పరంగా కష్టంగా ఉందా. నీకు ఇష్టంలేకపోతే నువ్వు ఇప్పటికిప్పుడు నటించడం ఆపేయచ్చు’ అంది. కానీ దీపిక బాధ తాను ఎంచుకున్న కెరీర్ గురించి కాదు. అసలు ఎందుకు బాధపడుతోందో ఎందుకు ఏడుస్తోందో తనకే అర్థం కావడంలేదు. ఏదో తెలీని డిప్రెషన్.దీని నుంచి బయటపడడానికి తల్లిదండ్రులు ఆమెను సైకాలజిస్ట్‌కి చూపించారు కూడా. రోజులు గడిచే కొద్దీ దీపిక డిప్రెషన్ నుంచి బయటపడింది. అంతేకాదు తనలా డిప్రెషన్‌తో కుమిలిపోతున్న వారికి అండగా ఉండాలని ‘లివ్ లవ్ లాఫ్’ అనే ఫౌండేషన్ కూడా స్థాపించింది. ఇలా దీపికా ఎన్నో ఒడిదొడుగులను ఎదుర్కొని ఉన్నత స్థానానికి చేరకుంది. ప్రజెంట్ దీపికా చేతిలో రిలీజ్ కు సిద్దమవుతున్న త్రిపుల్ సిరీస్ తో పాటు, సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో పద్మావతి సినిమా చేస్తోంది. ఇలాంటి విజయాలు మరెన్నో అందుకోవాలని ఆశిద్దాం..