తెలంగాణ ప్రభుత్వం పేదలకు పక్కా వసతి కల్పించుటకై కొల్లూరు-2లో నిర్మిస్తున్న రెండు పడక గదుల ఫ్లాట్స్ పనులను హడ్కో ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ డా. మేడితి రవికాంత్ శుక్రవారం పరిశీలించారు. 1985 – బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన డా. ఎం. రవికాంత్ హడ్కోకు ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులైన మొట్టమొదటి తెలుగు అధికారి. 124 ఎకరాల విస్తీర్ణంలో 117 బ్లాకులలో 15,660 ఫ్లాట్స్‌ను నిర్మిస్తున్నారు. దాదాపు 90శాతం పనులు పూర్తి అయ్యాయి.
దేశంలో ఎక్కడాలేనివిధంగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేవిధంగా 124 ఎకరాల్లో ఒకే చోట అత్యంత నాణ్యతగా, పూర్తిస్థాయి మౌలిక వసతులతో ఈ ఫ్లాట్లు ఉన్నట్లు సంతృప్తి వ్యక్తం చేశారు. కొల్లూరులో నిర్మిస్తున్న రెండు పడక గదుల ఫ్లాట్లు దేశానికే మోడల్‌గా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఫ్లాట్‌కు కేంద్ర ప్రభుత్వం రూ. 1లక్ష 50వేలను ఆర్థిక సహాయంగా అందిస్తున్నది. దీనికి తెలంగాణ ప్రభుత్వం హడ్కో నుండి రుణంగా తీసుకొని ప్రతి ఫ్లాట్‌కు సౌకర్యవంతంగా పూర్తిస్థాయి వసతులు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ ఇతర పౌర సదుపాయాలను కల్పించుటకు రూ. 8లక్షల 65వేలను ఖర్చు చేస్తున్నది.
లబ్దిదారులకు నూరు శాతం రాయితీపై హడ్కో ఇళ్లను కేటాయిస్తుంది. 2020 మార్చి నెలాఖరుకు మిగిలిన పనులను పూర్తిచేసి లబ్దిదారులకు అప్పగించాలని హడ్కో ఛైర్మన్ సూచించారు. ఈ సందర్భంగా ఫ్లాట్స్ వద్ద మొక్కలు నాటారు.ఈ పర్యటనలో జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, హడ్కో రీజనల్ కో-ఆర్డినేటర్ ఎల్.వి.ఎస్ సుధాకర్ బాబు, హౌసింగ్ ఓ.ఎస్.డి కె.సురేష్‌కుమార్, ఎస్.ఇ కె.కిషన్, డి.ఇ.సి ఎండి అనిరుద్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.