ఎస్సీ, మైనారిటీ గురుకులాలపై మంత్రి కొప్పుల సమీక్ష..

189
Koppula Eshwar
- Advertisement -

జులై 1వ తేదీ నుంచి విద్యాసంస్థలు ప్రారంభమవుతున్న సందర్భంగా ఎస్సీ, మైనారిటీ గురుకులాలపై సమీక్షా సమావేశం జరిగింది. మాసబ్ ట్యాంక్ లోని సంక్షేమ భవన్ లో సోమవారం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పులఈశ్వర్ అధ్యక్షతన సుమారు 3గంటల పాటు ఈ సమావేశం జరిగింది. సమావేశంలో మైనారిటీ వ్యవహారాల సలహాదారు ఎ.కె.ఖాన్, ప్రభుత్వ కార్యదర్శులు రాహూల్ బొజ్జ, అహ్మద్ నదీమ్,ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, మైనారిటీ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి షఫీఉల్లా,ఉన్నత విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ ప్రవీణ్ తదితర అధికారులు పాల్గొన్నారు

ఈ సందర్భంగా మంత్రి కొప్పుల అధికారులకు దిశానిర్దేశం చేశారు. మన గురుకులాలకు దేశం మొత్తం మీద మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. మీతో పాటు ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పని చేస్తున్నందునే ఈ పేరొచ్చిందని మంత్రి కొనియాడారు. వీటి పేరు ప్రతిష్టలు మరింత ఇనుమడించే విధంగా..పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉండేలా.. ప్రభుత్వ ప్రతిష్ట మరింత పెరిగేలా ముందుకు సాగండి అని అధికారులను కోరారు. పేద వర్గాల నుంచి వచ్చిన మన విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెరిగింది. వీళ్లు అన్ని రంగాలలో గొప్పగా రాణిస్తున్నారు,మరిన్ని విజయాలు సాధించేలా తీర్చిదిద్దండి అని మంత్రి సూచించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోండి. ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, సిబ్బంది అందరికి టీకా వేయించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. విద్యాలయాల పరిసరాలు,తరగతి,హాస్టల్ గదులు, కిచెన్, బాత్‌ రూంలు పరి శుభ్రంగా ఉండేట్లు చూడాలి. అవసరమైన మరమ్మతులు తొందరగా పూర్తి చేయండి.. తరగతి,హాస్టల్ గదుల్లో గాలి,వెలుతురు చక్కగా వచ్చేట్లు చూడాలి. అలాగే అడ్మిషన్లు తొందరగా పూర్తి చేయాలి. పాఠ్య, నోట్ పుస్తకాలు, బెడ్ షీట్లు, దుస్తులు సకాలంలో అందించండి.. విద్యార్థులను పొద్దటి పూట 20నిమిషాల పాటు ఎండలో ఉంచాలి.

రోగ నిరోధక శక్తి పెంపొందించేందుకు గాను వాము వాటర్ లో పచ్చి పసుపు కలిపి అందించాలి..పోషకాహారం అందేలా చూడండి. డైట్ ధరల పెంపునకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయండి అని మంత్రి ఆదేశించారు. బాలుర డ్రాపౌట్స్ తగ్గించేందుకు గాను డిగ్రీ కాలేజీలు ప్రారంభించాల్సి అవసరం గురించి ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకెళ్తా..స్థలం, సౌకర్యాలు అందుబాటులో ఉన్న చోట విద్యార్థుల కోసం కోళ్లు,గొర్లు, కూరగాయలు పెంచండి అని మంత్రి తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవలసిన చర్యల గురించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, సిబ్బందికి అవగాహన పెంపొందించాలని.. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కొప్పుల అధికారులను ఆదేశించారు.

- Advertisement -