రేప్ కేసులో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు నేడు (సోమవారం – ఆగస్టు28) శిక్ష ఖరారు కానుంది. కాగా హెలికాఫ్టర్ ద్వారా న్యాయమూర్తి జగ్దీప్ సింగ్ జైలుకు చేరుకోనున్నారు. మధ్యాహ్నాం 2 గంటల 30 నిమిషాల సమయంలో తీర్పు వెలువడే అవకాశం ఉందని సమాచారం.
అయితే తీర్పు వెలువడిన అనంతరం డేరా అనుచరులు సృష్టించే విధ్వంసం దృష్ట్యా.. పంచకుల, సిస్రా తరహా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని హర్యానా ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసినట్లు రోహ్‌తక్ జిల్లా కలెక్టర్ అతుల్ కుమార్ ప్రకటించారు.
రోహ్‌తక్ లో ఎవరైనా సరే శాంతి భద్రతలకు భంగం కలిగించాలని ప్రయత్నిస్తే ముందు హెచ్చరిక జారీ చేస్తామని తెలిపారు. అయినా కవ్వింపు చర్యలకు పాల్పడినా, ఎవరికైనా హని తలపెట్టినా, ఆత్మహత్యాయత్నం చేసినా కాల్చివేస్తామంటూ ప్రకటించారు. ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. హైకోర్టు సూచనల మేరకే తాము నడుచుకుంటామని కలెక్టర్ అతుల్ కుమార్ అన్నారు.
గుర్మీత్ ఉన్న సునారియ జైలు చుట్టుపక్కల మొత్తం 23 పారామిలటరీ భద్రత దళాలను మోహరించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు అధికారులు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు కూడా బయటికి రావొద్దని, మీడియాకు కూడా పలు సూచనలు చేశారు.