అమెరికాలో కాల్పుల కలకలం…

242
Gunmen shoots @ republicans
- Advertisement -

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. వర్జీనియాలోని  అలెగ్జాండ్రియాలో బేస్‌బాల్ ఆడుతున్న రాజకీయ నాయకులపై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఉదయం ఏడు గంటల సమయంలో 20 నుంచి 25 మంది అమెరికా కాంగ్రెస్ సభ్యులు బేస్‌బాల్ ఆటను ప్రాక్టీసు చేస్తుండగా దుండగుడు ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. ఈ ఘటనలో లూసియానాకు చెందిన మెజారిటీ సభ విప్ స్టీవ్ స్కేలిస్ తీవ్రంగా గాయపడ్డారు. స్కేలిస్ అంగరక్షకులు జరిపిన ఎదురు కాల్పుల్లో దుండగుడు కూడా హతమయ్యాడని  పోలీసులు తెలిపారు.

ఈ సంఘటనలో తుంటికి గాయం కావడంతో జార్జి వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్కేలీస్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ప్రతినిధుల సభలో విప్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న స్కేలీస్‌ను రిపబ్లికన్ల నంబర్‌.3 నాయకుడిగా పరిగణిస్తారు. 2008లో ఆయన తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. అక్కడ సాధన చేస్తున్న రాజకీయ నాయకులు రిపబ్లికన్లా? డెమొక్రాట్లా ? అని కాల్పులకు ముందు దుండగుడు విచారించినట్లు తెలుస్తోంది.

శ్వేతజాతీయుడైన దుండగుడు పది నుంచి 20 రౌండ్ల వరకు కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. స్కేలిస్‌తోపాటు అతని అంగరక్షకులు ఇద్దరికి కూడా బుల్లెట్ గాయాలయ్యాయని చెప్పారు. ఈ కాల్పుల్లో మొత్తం ఐదుగురు గాయపడ్డారని, అందరినీ స్థానిక దవాఖానకు తరలించామని చెప్పారు. వర్జీనియాలో జరగిన కాల్పుల ఘటనపై దేశాధ్యక్షుడు డొనాల్ ట్రంప్ స్పందించారు.

టెలివిజన్‌లో ఆయన దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, వర్జీనియాలో కాల్పుల ఘటన విచారకరమని పేర్కొన్నారు. పోలీసులు సకాలంలో స్పందించకపోయి ఉంటే చాలా ప్రాణాలు పోయేవని తెలిపారు. పోలీసులు తూటాలకు ఎదురొడ్డి దుండగుడిని కాల్చిచంపారని చెప్పారు. చట్టసభ ప్రతినిధి స్టీవ్ స్కేలిస్ మంచి మిత్రుడు, దేశభక్తుడు. తీవ్రంగా గాయపడ్డాడు కానీ త్వరగా కోలుకుంటాడు. మా ఆలోచనలు, ప్రార్థనలు ఆయనతోనే ఉన్నాయి అని ట్రంప్ అంతకుముందు ట్వీట్ చేశారు.

- Advertisement -