గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ పేర్లను టీఆర్ఎస్ అధిష్టానం ఖరారు చేసింది. మేయర్‌గా గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్‌గా రిజ్వానా షమీమ్ పేర్లను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్ రెడ్డి కలిసి ప్రకటించారు.గుండు సుధారాణి 29వ డివిజన్ నుంచి గెలుపొందగా, రిజ్వానా షమీమ్ 36వ డివిజన్ నుంచి గెలుపొందారు.గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 66 డివిజన్లు ఉండగా, టీఆర్ఎస్ 48, బీజేపీ 10, కాంగ్రెస్ 4, ఇతరులు 4 స్థానాల్లో గెలుపొందారు.
అటు, ఖమ్మం కార్పొరేషన్ లోనూ మహిళలకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలు రెండూ అతివలకే లభించాయి. ఖమ్మం మేయర్ గా పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ గా ఫాతిమా జోహ్రాలను ఎన్నుకున్నారు. వీరిద్దరినీ పార్టీ హైకమాండ్ కీలక పదవులకు ఎంపిక చేయగా, వారి పేర్లను మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు. కాగా, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో నీరజ 26వ డివిజన్ నుంచి, ఫాతిమా 37వ డివిజన్ నుంచి విజయం సాధించారు.