ప్రచారం ముగిసింది. ఆశీర్వాదం ఎవరికనేదే ఇప్పుడు ఉత్కంఠ. గుజరాత్ లో మొదటి దశ ఎన్నికల ప్రచారం పూర్తి చేసుకున్న కాంగ్రెస్, భాజపా పార్టీలు ప్రచారంలో హోరా హోరిగా తలపడ్డాయి. ఈనెల 9వ తేదీన గుజరాత్ తొలివిడత ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో మొత్తం 89 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ 89 నియోజకవర్గాల్లో మొత్తం 977 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
అందుకే ప్రధాని నరేంద్రమోదీ రంగంలోకి దిగి సుడిగాలి పర్యటనలు చెయ్యవలసి వచ్చింది. కాబోయే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం తన శక్తినంతా ఒడ్డి మోదీని ఎదుర్కొన్నారు. గుజరాత్ లో మళ్ళీ పగ్గాలు చేపట్టే పార్టీ ఏదంటూ…ఉత్కంఠతో పాటు ఉత్సాహంగా కూడా అటు సామాన్య ప్రజలతో పాటు ఇటు రాజకీయ విశ్లేషకులు సైతం ఎదురుచూస్తున్నారన్నది వాస్తవం. గుజరాత్ మొత్తం మోదీ జపమే కదా..ఇక గుబులెందుకు అనుకుంటే మాత్రం పొరపాటే.
రాను రాను రాజకీయ పరిణామాలు మారుతున్న విషయం తెలిసిందే. ఇక్కడ ఈక్వేషన్స్ మారుతున్న కొద్దీ పార్టీల్లో అలజడి మొదలవుతోంది. అయితే ఎప్పటికైనా గుజరాత్ కా షేర్ మోదీజీ..అనుకుంటే ఈ ఎన్నికలను నరేంద్రమోదీ సిరియస్ గా తీసుకునే వారు కాదని, అందుకే స్వయంగా మోదీ ప్రచారంలో పాల్గొన్నారనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అంతేకాకుండా రోజురోజుకీ మారుతున్న ఈక్వేషన్స్ కారణంగా వచ్చిన టెన్షన్‌తోనే నరేంద్రమోడీ, కాంగ్రెస్ పార్టీని ఇంతకు ముందెన్నడూ లేనంత సీరియస్‌గా తీసుకుంటున్నారని అంటున్నారు.
ఇక రాహుల్‌గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చెసే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. బీజేపీ పై తీవ్ర విమర్శలు చేస్తూనే..మోదీ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు రాహుల్. ఇప్పటికే నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, అదీ కాక మోదీ ప్రవేశపెట్టిన జీఎస్టీ విధానం వల్ల ప్రజలు తీరని ఇబ్బందులకు లోనవుతున్నారని రాహుల్ దుయ్యబట్టారు. జీఎస్టీ అంటే గబ్బర్ సింగ్ ట్యాక్స్ అంటూ జీఎస్టీకి ఓ కొత్త నిర్వచనం చెప్పారు రాహుల్. దేశ ప్రజల పట్ల జీఎస్టీ ఓ విలన్‌గా మారిందన్నారు.
ఇక ఇదంతా ఒకెత్తైతే..ఇటీవలే ఓ తమిళ సినిమాలో కూడా జీఎస్టీకి సంబంధించిన డైలాగ్స్ దుమారం లేపడం..వంటి అంశాలతో జీఎస్టీ పై ప్రజల్లో ఎలాంటి భావన ఉందనేది అర్థమతోంది. ఇక గడచిన మూడున్నరేళ్ళలో దేశంలో మారిన, మారుతున్న రాజకీయ సమీకరణాలు గుజరాత్ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపబోతున్నాయని తెలుస్తోంది. , పెద్ద నోట్ల రద్దు – జీఎస్‌టీ గుజరాత్ ఎన్నికల్లో చూపే ప్రభావం అంతా ఇంతా కాదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇప్పటికీ సర్వేల్లో కాంగ్రెస్ పార్టీకి ‘ఎడ్జ్’ కన్పించకపోయినా, బీజేపీ గ్రాఫ్ దారుణంగా తగ్గిపోయిందనే సంకేతాలు కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహాన్నిస్తున్నాయి. అయితే తాజా సర్వేల ప్రకారం ఓటింగ్ శాతం పరంగా చూస్తే బీజేపీ – కాంగ్రెస్‌కి మధ్య పెద్దగా తేడా వుండకపోవచ్చని విశ్లేషకుల అభిప్రాయం. ఇదంతా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు సర్వేలు వెల్లడిస్తున్న విషయాలే కాబట్టి, ఎన్నికల నాటికి పరిస్థితులెలా మారిపోతాయోనన్న ఆందోళన బీజేపీలో వ్యక్తమవుతోంది. అందుకే, మోడీ ఇంతకు ముందెన్నడూ లేనంత కంగారుగా కన్పిస్తున్నారు.
బీజేపీ సంగతి సరే, కాంగ్రెస్ మాటేమిటి..? బీజేపీ కంటే ఒకటో రెండో సీట్లు ఎక్కువ తెచ్చుకుంటే కుదరదు, క్లియర్ మెజార్టీ దక్కాలి. లేదంటే..గోవాలో జరిగిందే మళ్ళీ రిపీట్ అవుతుందని, (బీజేపీ సీట్ల పరంగా రెండో స్థానంలో నిలిచినా ఆయా రాష్ట్రాల్లో అధికారం దక్కించుకుంది.) కాంగ్రెస్‌కి ఎవరు అధ్యక్షులుగా వచ్చినా గుజరాత్‌లో విజయం మాత్రం గగనమేనని విశ్లేషకుల అభిప్రాయం. ఎప్పుడూ..బడుగు వర్గాలకు దన్నుగా నిలిచే కాంగ్రెస్ పార్టీ.. ఆ పార్టీకి కాబోమే అధ్యక్షుడు మైనారిటీలను విస్మరించి, గుళ్ళూ గోపురాలు తిరగడం అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తోంది. ఇది కేవలం ఓట్ల ఎత్తుగడ మాత్రమేనని హిందువులు భావిస్తున్నారు.
ఏదేమైనా..కొసరు మాత్రం బీజేపీకే వేస్తున్నారు. కాంగ్రెస్ గెలిచి బట్టకడుతుందని ఎవరూ ఢంకా బజాయించి చెప్పలేకపోతున్నారు. అయినా 9వ తేదీ రాత్రికి కొంత స్పష్టత వచ్చే అవకాశం లేకపోలేదు. చూడాలి మరి… గుజ’రాత’ ఏ పార్టీని మారుస్తుందో..!