ఉత్కంఠ పోరులో గుజరాత్ టైటాన్స్ విజయం..

92
Gujarat
- Advertisement -

ఐపీఎల్ 2022లో శనివారం ఉత్కంఠ పోరు జరిగింది. ముంబయిలో కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ రసవత్తరంగా జరిగింది. అయితే, గుజరాత్ టైటాన్స్ కీలక సమయాల్లో వికెట్లు తీసి 8 పరుగుల తేడాతో కోల్ కతాను దెబ్బ కొట్టింది. 157 పరుగుల లక్ష్యఛేదనలో కోల్ కతా 20 ఓవర్లలో 8 వికెట్లకు 148 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఇక, ఈ విజయంతో 12 పాయింట్లు సాధించిన గుజరాత్ టైటాన్స్ టాప్ ప్లేసుకి చేరుకుంది.

ఆండ్రీ రస్సెల్ (25 బంతుల్లో 48 పరుగులు ; 1 ఫోర్, 6 సిక్సర్లు) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు కోల్ కతా జట్టులో రింకు సింగ్ 35 పరుగులు చేశాడు. ఓపెనర్లు శామ్ బిల్లింగ్స్ (4), సునీల్ నరైన్ (5) విఫలం కావడం కోల్ కతా మిడిలార్డర్ పై ఒత్తిడి పెంచింది. దానికితోడు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (12), నితీశ్ రాణా (2) కూడా అవుట్ కావడంతో కోల్ కతా ఇన్నింగ్స్ ఒడిదుడుకులకు గురైంది. రస్సెల్ పోరాడినా, ఆఖర్లో సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోయింది. లోయరార్డర్ లో ఉమేశ్ యాదవ్ (15 నాటౌట్) ఓ మోస్తరు ప్రయత్నం చేసినా అది నిష్ఫలమే అయింది. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీ 2, యశ్ దయాళ్ 2, రషీద్ ఖాన్ 2, అల్జారీ జోసెఫ్ 1, లాకీ ఫెర్గుసన్ 1 వికెట్ తీశారు.

అంతకుముందు గుజరాత్ టైటాన్స్ ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. హార్ధిక్ పాండ్యా (49 బంతుల్లో 67 పరుగులు; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. డేవిడ్ మిల్లర్ (20 బంతుల్లో 27 పరుగులు ; 1 ఫోర్, 2 సిక్సర్లు) ఫర్వాలేదన్పించాడు. కోల్ కతా బౌలర్లలో టిమ్ సౌథీ దుమ్మురేపాడు. ప్యాట్ కమిన్స్ స్థానంలో జట్టులోకి వచ్చిన సౌథీ మూడు వికెట్లతో గుజరాత్ జోరుకు బ్రేకులు వేశాడు. ఇక, ఆఖరి ఓవర్ లో రస్సెల్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.

- Advertisement -