జీఎస్టీపై గందరగోళం తొలగించే పనిలో పడింది కేంద్రం. క్షేత్రస్ధాయిలో జీఎస్టీపై ప్రజల్లో వ్యతిరేకత వస్తున్న తరుణంలో మంత్రివర్గ సంఘం పలు కీలక సూచనలు చేసింది. ముఖ్యంగా జీఎస్టీ పేరుతో వినియోగదారుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్న వ్యాపార సంస్థల కొరడా ఝళిపించేందుకు రంగం సిద్దం చేసింది. ప్యాక్ చేసిన సరుకులపై ఎంఆర్‌పీకి అదనంగా జీఎస్టీ వసూల్ చేయడం, అసలు జీఎస్టీ పరిధిలోకి రాని వాటిపై ట్యాక్స్ విధిస్తూ వినియోగదారుల నడ్డి విరుస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సూచించింది.
జీఎస్టీని కలుపుకునే ఎమ్మార్పీని ముద్రించాలని …ఎమ్మార్పీయే ఫైనల్ అని తెలిపింది. ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు, శీతల పానీయాలు, నీళ్ల బాటిళ్లు తదితర ఎలాంటి వస్తువులనైనా మాల్స్, రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు వంటి ఏ దుకాణంలోనైనా సరే ఎమ్మార్పీకి మించి అమ్మితే నేరంగా పరిగణించి కేసు నమోదు చేయాలని మంత్రివర్గ సంఘం స్పష్టం చేసింది. నవంబర్ 10న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని జీఎస్టీ మండలి గౌహతిలో సమావేశం కానుంది. మంత్రివర్గం సిఫారసులను ఆ భేటీలో జీఎస్టీ మండలి పరిగణలోనికి తీసుకునే అవకాశం ఉంది.
వస్తువు అసలు ధర ఎంత, దానిపై పడుతున్న పన్ను ఎంత, మొత్తం ధర ఎంత అనే విషయాలను వాణిజ్య సంస్థలు బిల్లుల్లో స్పష్టంగా ముద్రించాలనీ పేర్కొంది. అలాగే పన్ను రిటర్నుల దాఖలులో జాప్యమైతే ప్రస్తుతం జరిమానాగా రోజుకు రూ.100 విధిస్తుండగా, దానిని రూ.50కి తగ్గించాలని సిఫారసు చేసింది.