జీఎస్టీ దెబ్బకు కన్సూమర్లకు ఏడాది మధ్యలోనే దీపావళీ వచ్చేసింది. జీఎస్‌టీ అమలుకు ముందే పాత సరుకును విక్రయించుకోవడానికి రిటైలర్లు భారీ డిస్కౌంట్లకు తెరతీశారు. ఖరీదైన గృహోపకరణాలు తక్కువ ధరలకే అందుబాటులోకి వస్తున్నాయి.
దాదాపు 20–40 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఎలక్ట్రానిక్ ఉపకరణాల విక్రయదారులు వారి సరుకును జూలై 1 నాటికి పూర్తిగా అమ్మేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తేదీ నుంచి వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమల్లోకి వస్తోంది. జీఎస్‌టీ వల్ల ఈ రిటైలర్లకు నష్టాలు రావొచ్చు. అందుకే ఈ నష్టాలను తగ్గించుకునేందుకు భారీ డిస్కౌంట్లు, ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షించి సరుకును ఖాళీ చేసుకోవాలని చూస్తున్నారు.
ఇదిలా ఉండగా పేటీఎం ప్రి జీఎస్టీ సేల్‌ను ప్రారంభించింది. ఇందులో దేశవ్యాప్తంగా 6 వేల రీటెయిలర్ల దగ్గర ఉన్న 500 బ్రాండ్లు అమ్మకానికి ఉన్నాయి. టీవీలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్స్, ఏసీలు, ఫ్రిడ్జ్‌లు, ఫుట్‌వేర్స్‌పై భారీ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఆఫ్‌లైన్ రీటెయిలర్లు తమ దగ్గర ఉన్న స్టాక్‌ను వదిలించుకునేందుకు ఈ సేల్ బాగా పనికొస్తుందని పేటీఎం ఒక ప్రకటనలో చెప్పింది. మెడికల్ షాప్స్ కూడా డిస్కౌంట్లో మందులంటూ కస్టమర్లకు మెసేజ్‌లు పంపిస్తున్నాయి.
అన్ని ఈ-కామర్స్ సంస్థలు ప్రస్తుతం ఇదే పనిలో ఉన్నాయి. 5 లక్షల మర్చంట్లు ఉన్న షాప్‌క్లూస్.కామ్ సేల్ గురించి కస్టమర్లకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నట్లు తెలిపింది. సీజన్ ఎండ్‌లో ఉండే సేల్‌ను చాలామంది రీటెయిలర్లు ఒక నెల ముందుగానే ప్రకటించారు. జీఎస్టీలోకి మారే ముందు పాత స్టాక్‌తో ఎలాంటి తలనొప్పులు ఉండకూడదన్న కారణంగా ఇలా డిస్కౌంట్లకు వస్తువులను అమ్మేస్తున్నారు.
టాప్ పుట్‌వేర్ బ్రాండ్ ప్యూమా ఫ్లాట్ 40 పర్సెంట్ ఆఫర్‌తోపాటు అదనంగా పది శాతం డిస్కౌంట్ ఇస్తున్నది. ఇక అలెన్ సోలీ కూడా బయ్ వన్ గెట్ వన్ ఆఫర్‌ను ప్రారంభించింది. లివైస్ అయితే రెండు కొంటే రెండు ఫ్రీ అంటుంటే.. ఫ్లయింగ్ మెషీన్ 50 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నది. అటు మోటార్ సైకిల్స్, కార్లపైన కూడా కంపెనీలు డిస్కౌంట్లు ప్రకటించాయి. బజాజ్ ఆటో రూ.4500 వరకు డిస్కౌంట్ ప్రకటించింది.