రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 64వ పుట్టిన రోజును పురస్కరించుకుని, ఆయన పిలుపు మేరకు జన్మదిన వేడుకలు అత్యంత నిరాడంబరంగా జరిగాయి. సీఎం కేసీఆర్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మంత్రి సతీమణి, ఎర్రబెల్లి ట్రస్టు చైర్ పర్సన్ శ్రీమతి ఉషా దయాకర్ రావు పాలకుర్తి నియోజకవర్గం పర్యటించి మొక్కలు నాటారు.
మంత్రి పిలుపు మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. గ్రామానికి కనీసం 100 చొప్పున 10వేలకు పైగా మొక్కలు నాటారు. రాయపర్తి, కొడకండ్ల, తొర్రూరు, పెద్ద వంగర, పాలకుర్తి, దేవరుప్పుల మండలాలు, ఆయా గ్రామాల్లో మొక్కలు నాటారు. తొర్రూరు మండలం మడిపల్లి బ్రిడ్జీ వద్ద కొందరు ఆయన అభిమానులు భారీ కటౌట్ కట్టి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. పాలకుర్తి ప్రభుత్వ హాస్పిటల్ లో రోగులకు పండ్లు, పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం సోమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎర్రబెల్లి ట్రస్ట్ అధ్వర్యంలో నడుస్తున్న ఫ్రీ కోచింగ్ సెంటర్ లో కేక్ కట్ చేశారు.
తన జన్మదినం సందర్భంగా మొక్కలు నాటిన, తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని, తనకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తానని, పేరుపేరునా ప్రతి ఒక్కరికీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.