దలీప్ సింగ్ రాణా అదేనండి ద గ్రేట్ ఖలీ.. పరిచయం అక్కర్లేని బాహుబలి. భారతదేశ భుజబలాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన సింహభలుడు. మహామహా మల్లయోధులను పాదం కింద అణచివేసిన బలశాలి. డబ్ల్యూడబ్ల్యూఈ వేదికపై అండర్‌టేకర్,బాటిష్ట,కేన్,స్టోన్ కోల్డ్ లాంటి వారిని మట్టికరిపించి మువ్వనెన్నల జెండాను రెపరెపలాండిన ఖలీ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కుతోంది.
ప్రముఖ దర్శకుడు జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఖలీ పాత్రలో రాణా నటిస్తుండగా ‘నరేంద్ర’ అనే టైటిల్‌ను ఖరారు చేసింది.ఈ మేరకు ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. ‘మిస్టర్ మజ్ను’ చిత్రంలో నటించిన బ్రెజిలియన్ మోడల్, నటి ఇసబెల్ లీత్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నారు. రామ్ సంపత్ సంగీతం అందిస్తున్నారు.
ఖలీ జీవితం వడ్డించిన విస్తరేం కాదు. ఆకలి, అవమానం, పేదరికం, చదువులేని తనం, బాల్యాన్నంతా వెక్కిరించాయి. కన్నీళ్లు దిగమింగుకున్నాడు. కష్టాలను వెంటేసుకుని తిరిగాడు. అవమానాలను భరించాడు. పిడికెడు మెతుకుల్లేక ఆకలితో నకనకలాడాడు. రెండున్నర రూపాయల స్కూల్ ఫీజు కట్టలేని దుర్భర జీవితాన్ని అనుభవించాడు. ఆ అవమానాలన్నింటినీ దిగమింది ఇవాళ భారతదేశంలో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు ఖలీ. ఈ నేపథ్యంలో ఖలీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.