ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మిక పక్షపాతి, పేదల పక్షపాతి అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గ్రామాల్లో పని చేసే సఫాయి కర్మచారుల వేతనాన్ని రూ.8500లకు పెంచుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు ప్రకటించడంతో కార్మిక వర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం నిర్వహించాయి.
తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం అధ్యక్షుడు జి.రాంబాబుయాదవ్, తెలంగాణ రాష్ట్ర గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల నర్సింహ, ప్రధాన కార్యదర్శి సిహెచ్.శ్రీనివాసచార్యులు, నేతలు బొల్లం శ్రీనివాస్, తిరుపతి, రాజవీరు, మల్లాచారి ఆధ్వర్యంలో వంద మంది కార్మికులు శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో తమ జీవితాల్లో వెలుగులు వచ్చాయని అన్నారు. గ్రామాల్లోని సఫాయి కార్మికుల వేతనాల పెంపుతో సీఎం కేసీఆర్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారని చెప్పారు మంత్రి ఎర్రబెల్లి.వేతనాల పెంపుపై అధికారులు, తాము కొంత వేరే విధంగా ఆలోచన చేసినా… సీఎం కేసీఆర్ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేలా నిర్ణయాలు తీసుకున్నారని మంత్రి పేర్కొన్నారు.