గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహాక నగదు..

151
errabelli
- Advertisement -

కేంద్ర ప్ర‌భుత్వ నానాజీ దేశ్ ముఖ్ గౌర‌వ్ గ్రామ స‌భ పుర‌స్కార్, ఫ్రెండ్లీ గ్రామ పంచాయ‌తీ పుర‌స్కార్, దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ పంచాయ‌త్ అవార్డులు పొందిన జెడ్పీ, మండ‌ల‌, గ్రామ పంచాయ‌తీల‌కు రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ప్రోత్సాహ‌క న‌గ‌దును అంద‌చేశారు. హైద‌రాబాద్ ఖైర‌తాబాద్ లోని రంగారెడ్డి జెడ్పీ లో గ‌ల పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన ఓ కార్య‌క్ర‌మంలో సోమ‌వారం సంబంధిత అవార్డులు గెలిచుకున్న స‌ర్పంచ్ లు, ఎంపీపీలు, జెడ్పీ చైర్మ‌న్లు, అధికారుల‌కు అవార్డులు, అందుకు అందిన మొత్తం కోటి 47 ల‌క్ష‌ల‌ న‌గ‌దు చెక్కుల‌ను మంత్రి అంద‌జేశారు.

కొద్ది రోజుల క్రిత‌మే ప్ర‌క‌టించిన ఈ అవార్డుల‌ను క‌రోనా నేప‌థ్యంలో వ‌ర్చువ‌ల్ లైవ్ ద్వారా కేంద్ర పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి అంద‌చేశారు. వాటికి స‌బంధించిన చెక్కుల‌ను తాజాగా మంత్రి ఆయా విజేత‌ల‌కు అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ, నిధులు ఇవ్వ‌క‌పోయినా, కేంద్ర ప్ర‌భుత్వం మ‌న తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ పనితీరుని, వివిధ ప‌థ‌కాల‌ను… అలాగే, గ్రామ స్వ‌రాజ్యానికి వేదిక‌లు జిల్లా, మండ‌ల‌, గ్రామ పంచాయ‌తీల ప‌నితీరుని కూడా అభినందించ‌డం హ‌ర్షించ‌ద‌గ్గ విష‌యం అన్నారు.

స్వ‌చ్ఛ భార‌త్, పారిశుద్ధ్యం, మంచినీటి స‌ర‌ఫ‌రా, విద్యుత్ స‌ర‌ఫ‌రా వంటి క‌నీస స‌దుపాయాల క‌ల్ప‌న‌లో మ‌న రాష్ట్రం దేశానికే ఆద‌ర్శంగా నిలిచింద‌న్నారు. ప్ర‌త్యేకించి సీఎం కెసిఆర్ చేప‌ట్టిన ప‌ల్లె ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మం అత్యంత విజ‌య‌వంతంగా అమ‌లు అవుతుంద‌న్నారు. ప‌ల్లెల్లో ప‌చ్చ‌ద‌నం, ప‌రిశుభ్ర‌త, ఆహ్లాద వాతావ‌ర‌ణ ప‌రిఢ‌విల్లుతున్న‌ద‌న్నారు. ఇంత‌గా విజ‌య‌వంత‌మైన ప‌ల్లె ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మానికి కూడా కేంద్రం కొంత నిధుల‌ను అంద‌చేయాల‌ని మంత్రి కేంద్రాన్ని కోరారు. కేంద్ర సాయం రాష్ట్ర ప‌థ‌కాల‌కు ప్రోత్సాహకంగా ఉంటుంద‌న్నారు.

కేంద్రం సాయం చేయ‌క‌పోయినా, సీఎం కెసిఆర్ గారు అనేక ప‌థ‌కాల‌కు రూప‌క‌ల్ప‌న చేసి అమ‌లు చేస్తున్నార‌ని మంత్రి ఎర్ర‌బెల్లి తెలిపారు. అలాగే గ్రామ పంచాయ‌తీల‌కు ఎప్పుడూ లేని విధంగా 15వ ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్ర ప్ర‌భుత్వ నిధులు అందుతున్నాయ‌న్నారు. ప్ర‌తి నెలా 307 కోట్ల రూపాయ‌ల‌ను అంద‌చేస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో విజేగా నిలిచిన జిల్లా, మండ‌ల‌, గ్రామ పంచాయ‌తీల ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులను మంత్రి స‌త్క‌రించారు. అభినందించారు. కాగా, పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి కార్య‌ద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా, క‌మిష‌నర్ ర‌ఘునంద‌న్ రావు త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

- Advertisement -