గౌతమీపుత్ర శాతకర్ణి. తెలుగు నేలపై చెరగని ముద్ర వేసిన శాతవాహన మహారాజు. విశ్వశాంతి కోసం కృషి చేసిన యోధుడు. తెలుగు నేలను అప్రతిహతంగా పాలించిన రాజులు శాతవాహనులు. తెలుగు నేలను పాలించిన శాతవాహన రాజుల్లో 23వ వాడు గౌతమీపుత్ర శాతకర్ణి. గౌతమీపుత్ర శాతకర్ణి కాలంలో శాతవాహన రాజ్యం విస్తరించింది. పాలన అంటే యుద్ధాలు మాత్రమే కాదు, కళలు, వైభవం, సాహిత్యం కూడా ఉంటాయని ఒకటో శతాబ్దంలోనే ప్రపంచానికి చాటిన కళాపురుషుడు శాతకర్ణి.
ఇంత గొప్ప యోధుడి చరిత్రను బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గౌతమి పుత్ర శాతకర్ణి విజయం కోసం చిత్రయూనిట్ 1,116 ఆలయాలలో పూజలను చేపట్టింది. ఇటీవలె హైదరాబాద్ ఫిలింనగర్ దైవసన్నిధానంలో హీరో బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ మహారుద్రాభిషేకం నిర్వహించారు. త్వరలోనే ఆడియోను పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇక సినిమా ప్రమోషన్‌లో భాగంగా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ట్రైలర్‌ను 100 థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు. ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ డిసెంబర్ 16న కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాలలో ట్రైలర్ ప్రపంచ వ్యాప్తంగా వంద థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు. కోటిలింగాల ప్రాంతంలోని కోటేశ్వరస్వామి ఆలయంలో బాలకృష్ణ ప్రత్యేకపూజలు నిర్వహించిన తర్వాత కరీంనగర్‌లోని తిరుమల థియేటర్‌కు వెళ్లి సాయంత్రం ఐదు గంటలకు ట్రైలర్‌ను ఆవిష్కరించనున్నారు.