దేశంలోనే 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోమవారం సారంగాపూర్ మండల కేంద్రంలో రూ. 20 కోట్ల వ్యయంతో నిర్మించిన 132/33 కేవి విద్యుత్ ఉప కేంద్రాన్ని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పట్టణాలు, గ్రామాలకు నిరంతర విద్యుత్ సరఫరా ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు సబ్ స్టేషన్ ల నిర్మాణాలకు నిధులను కేటాయిస్తున్నారని అన్నారు. ప్రజలకు నిరంతరం నాణ్యమైన కరెంట్ సరఫరా లక్ష్యంగా ఈ ప్రాజెక్టు నెలకొల్పినట్లు తెలిపారు.
గతంలో తరచూ విద్యుత్ సరఫరా నిలిచి పోవడం, లోవోల్టేజీ సమస్యలతో వినియోగదారులు నానా అవస్థలు పడ్డారని, ఇప్పుడు ఎలాంటి అంతరాయాలు లేకుండా నిర్విరామంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. ఈ ఉప కేంద్రం ఏర్పాటుతో లో ఓల్టేజీ, బ్రేక్ డౌన్ సమస్యలు తీరిపోనున్నాయని పేర్కొన్నారు. ఎటువంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరాకి ఈ ఉప కేంద్రం బాగా ఉపయోగపడుతుందని చెప్పారు. నియోజకవర్గంలో 50 కి పైగా స్టేషన్ లను ఏర్పాటు చేశామని, సారంగపూర్ మండలంలోనే 9 సబ్ స్టేషన్లు నిర్మించుకున్నామని తెలిపారు.దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు రైతుల కోసం ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారని అన్నారు. స్వర్ణ వాగు పైన నిర్మించిన చెక్ డ్యామ్ లతో నీళ్లు పుష్కలంగా ఉన్నాయని భూగర్భ జలాలు పెరిగాయని అన్నారు..