బోయిన్‌ప‌ల్లి మార్కెట్‌ను సంద‌ర్శించిన గ‌వ‌ర్న‌ర్..

185
- Advertisement -

రాష్ర్ట గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ మంగ‌ళ‌వారం ఉద‌యం బోయిన్‌ప‌ల్లి మార్కెట్‌ను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసైకి వ్య‌వ‌సాయ శాఖ కార్య‌ద‌ర్శి జ‌నార్ధ‌న్ రెడ్డి స్వాగ‌తం ప‌లికారు. విద్యుత్‌, బ‌యోగ్యాస్ ప్లాంట్ ప‌నితీరును ప‌రిశీలించిన గ‌వ‌ర్న‌ర్‌.. ఆ ప్రాంత‌మంతా క‌లియ‌తిరిగారు. ప‌నుల వివ‌రాల‌ను అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. కూర‌గాయ‌ల రైతుల‌తో గ‌వ‌ర్న‌ర్ మాట్లాడారు.

బోయిన్‌పల్లి మార్కెట్‌లో కూరగాయల వ్యర్థాల నుంచి విద్యుత్తు, బయోగ్యాస్‌ తయారు చేయడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల ప్రశంసలు కురిపించిన విష‌యం తెలిసిందే. ఆదివారం నిర్వహించిన ‘మన్‌కీ బాత్‌’లో భాగంగా ప్రధాని ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. చెత్త నుంచి విద్యుత్తు, బయోగ్యాస్‌ ఉత్పత్తి చేయడమనే సరికొత్త ఆవిష్కరణకు బోయిన్‌పల్లి మార్కెట్‌లో నాంది పలికారని ఆయన కొనియాడారు.

సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి కూరగాయల మార్కెట్‌ రాష్ట్రంలో అతిపెద్ద మార్కెట్‌. ఇక్కడ ప్రతిరోజూ 5-10 టన్నుల కూరగాయల వ్యర్థాలు పోగుపడుతాయి. ఈ వ్యర్థాలను గతంలో జవహర్‌నగర్‌లోని డంపింగ్‌ యార్డ్‌కు తరలించేవారు. ఇందుకోసం కోసం లక్షల్లో ఖర్చు చేయాల్సి వచ్చేది. కానీ, ప్రభుత్వం వ్యర్థాల నుంచి విద్యుత్తుతోపాటు, బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేసేందుకు 30 కోట్ల రూపాయలతో బయోప్లాంట్‌ను ఏర్పాటుచేసింది. ఈ ప్లాంట్‌ దేశంలో తమిళనాడు తర్వాత రెండోదిగా నిలిచింది. మార్కెట్‌ రూపురేఖల్నే మార్చిన ఈ ప్లాంట్‌ ఇప్పుడు ప్రధాని మోదీ నోట వినిపించింది.

- Advertisement -