మౌంటెనీర్ అఖిల్‌ను అభినందించిన గ‌వ‌ర్న‌ర్

279
tamili sai
- Advertisement -

యువ‌త‌లో ధైర్య సాహ‌సాలు పెరిగిన‌ప్పుడే దేశ గౌర‌వం ఇనుమ‌డిస్తుంద‌ని రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ పేర్కొన్నారు. గురువారం రాజ్‌భ‌వ‌న్‌లో మౌంటెనీర్ లో అంత‌ర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న విద్యార్థి రాస‌మ‌ళ్ల అఖిల్‌ను గ‌వ‌ర్న‌ర్ అభినందించారు.

రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటి అధ్య‌క్షురాలు అయిన గ‌వ‌ర్న‌ర్ ఆదేశాల మేర‌కు వ‌రంగ‌ల్ అర్భ‌న్ జిల్లా క‌లెక్ట‌ర్ ప్ర‌శాంత్ జె.పాటిల్ చొర‌వ‌తో యూత్ రెడ్ క్రాస్‌లో రాస‌మ‌ల్ల అఖిల్ స‌భ్యులుగా చేరారు. యూత్ రెడ్‌క్రాస్ స‌భ్యుల‌కు మౌంటెయినీరింగ్ పై అఖిల్‌ అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా త‌న ప‌ర్వ‌తారోహ‌క అనుభ‌వాల‌ను గ‌వ‌ర్న‌ర్‌కు అఖిల్‌ వివ‌రించారు. వ‌రంగ‌ల్ అర్భ‌న్ జిల్లా హ‌న్మ‌కొండ‌లోని కిష‌న్‌పుర‌కు చెందిన రాస‌మ‌ళ్ల అఖిల్ ప్ర‌పంచంలో అత్యంత క్లిష్టంగా ఉన్న ఎత్తైన‌ మూడు ప‌ర్వతాల‌ను అధిరోహించారు.

ద‌క్షిణాఫ్రికాలో 5,940 మీట‌ర్ల ఎత్తున ఉన్న కిల్ మంజారో ప‌ర్వ‌తాన్ని, నేపాల్ స‌రిహ‌ద్దున ఉత్తరాఖండ్‌లో 5,200 మీట‌ర్ల ఎత్తున ఉన్న పంజాచిల్లా (Panja chilla) ప‌ర్వ‌తాన్ని, చైనా స‌రిహ‌ద్దులో ల‌డ‌క్ ప్రాంతంలో 6,160 మీట‌ర్ల ఎత్తున ఉన్న స్టాక్ కాంగ్రి (Stok kangri) ప‌ర్వ‌తాన్ని రాస‌మ‌ళ్ల అఖిల్ అధిరోహించారు. ఏపిలోని గుంటూరు జిల్లాకు చెందిన సాయికిర‌ణ్‌తో క‌లిసి 2018 ఆగ‌ష్టు 15న స్టాక్ కాంగ్రి ప‌ర్వ‌తంపై ప్ర‌పంచంలోనే పెద్ద‌దైన 365 అడుగుల‌ భార‌త జాతీయ జెండాను ఆవిష్క‌రించారు.

370 ఆర్టిక‌ల్ ర‌ద్దు త‌ర్వాత ల‌డ‌క్‌లో పెద్ద జాతీయ జెండాను ఎగ‌ర‌వేయ‌డాన్ని ఆ ప్రాంత ప్ర‌జ‌ల‌ను, మీడియాను విశేషంగా ఆక‌ట్టుకుంది. దీనికి స్పందించి హైరేంజ్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డులో న‌మోదు చేశారు. రికార్డు ప‌త్రాన్ని గ‌వ‌ర్న‌ర్‌కు రాస‌మ‌ళ్ల అఖిల్ చూపారు. రాస‌మ‌ళ్ల అఖిల్ ప‌ర్వ‌తారోహ‌ణ చేస్తూనే వ‌రంగ‌ల్ కాక‌తీయ యూనివ‌ర్సిటీ దూర విద్య‌లో డిగ్రీ ఫైన‌లీయర్ చ‌దువుతున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఇండియ‌న్ రెడ్ క్రాస్ సొసైటి జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యులు డా.పి.విజ‌య‌చంద‌ర్‌రెడ్డి, రాష్ట్ర యూత్ రెడ్ క్రాస్ కో-ఆర్డినేట‌ర్‌ ఈ.వి.శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

- Advertisement -