తెలుగు రాష్ట్రాల చరిత్రలో చిరస్ధాయిగా నిలిచిపోనున్నారు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్. 2009 డిసెంబర్ 28 నుంచి తెలుగు రాష్ట్రాల గవర్నర్‌గా కొనసాగుతున్న ఆయన తొమ్మిదేళ్ల కాలంలో 4 గురు ముఖ్యమంత్రుల చేత ప్రమాణస్వీకారం చేయించారు. కిరణ్ కుమార్ రెడ్డి,చంద్రబాబు, కేసీఆర్‌ల చేత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించిన నరసింహన్…ఈ నెల 30న జగన్‌చేత ప్రమాణస్వీకారం చేయిస్తే ఐదుగురు ముఖ్యమంత్రుల చేత ప్రమాణస్వీకారం చేయించిన వ్యక్తిగా ఖ్యాతి గడించనున్నారు.
2009లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 22వ గవర్నర్‌గా నరసింహన్ బాధ్యతలు చేపట్టారు. తొలిసారి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డితో ప్రమాణం చేయించారు. 2014లో రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్,ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు. 2018 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌తో రెండోసారి ప్రమాణం చేయించారు.
జగన్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించనున్న నరసింహన్ 9ఏళ్లలో ఐదుగురు సీఎంలతో ప్రమాణ స్వీకారం చేయించిన వ్యక్తిగా రికార్డు సృష్టించనున్నారు.