ఇరు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పై బీజేపీ, తెలంగాణ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్ స్పందిస్తూ …ఒకే కుటుంబంలో పెద్దలు, పిల్లలకు మధ్య వివాదం, మనస్పర్ధలు సహజమని స్పష్టం చేశారు. నేతల కోపతాపాలు నెమ్మదిగా సర్దుకుంటాయని, బంధాలను విడగొట్టలేం కదా అని గవర్నర్ అన్నారు.
అంతేకాకుండా ఇది కుటుంబ వ్యవహారంలాంటిదని, దీని గురించి బయట మాట్లాడరాదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు, తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు చిన్నవేనని స్పష్టం చేసిన ఆయన విభజన చట్టంలోని కొన్ని సమస్యలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఆ సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేశారు.
ప్రస్తుతం గవర్నర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కేంద్ర హోంశాఖ అధికారులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు నరసింహన్ పైవిధంగా సమాధానమిచ్చారు. కాగా..రాజ్‌భవన్ పనితీరును మరింత మెరుగుపరిచేందుకు కొన్ని సూచనలు చేశానని, ప్రజలకు రాజ్‌భవన్‌ను మరింత చేరువ చేస్తామన్నారు. పచ్చదనం – పరిశుభ్రత అంశాలపై దృష్టి సారించామని గవర్నర్ ఉద్ఘాటించారు.