అంగన్ వాడి ఉద్యోగులకు శుభవార్త

578
anganwadi
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం అంగన్ వాడీల ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. దసరా పండగ సందర్భంగా అంగన్ వాడీ ఉద్యోగులకు ముందే వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 83 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అడిగిన వెంటనే అంగన్ వాడీ ఉద్యోగుల వేతనాల కోసం నిధులు విడుదల చేయడంపై గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ముఖ్యమంత్రి కేసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. అంగన్ వాడి ఉద్యోగులకు జీతాలు ప్రతి నెల చివర్లో వస్తున్నాయి.

అయితే ఈనెల దసరా పండుగ మొదటి వారంలో రావడంతో వేతనాలు లేకపోవడం వల్ల పండగకు ఆర్థికంగా ఇబ్బందిగా ఉందని తెలంగాణ అంగన్ వాడీ సంఘం నేతలు నిన్న మంత్రి సత్యవతి రాథోడ్ ను కలిశారు. అంగన్ వాడీల విజ్ణప్తిని మంత్రి సీఎం కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో.. వెంటనే స్పందించిన సిఎం ఉద్యోగులకు వేతనాల కోసం నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. అడిగిన వెంటనే స్పందించి తమ సమస్యలను సిఎం కేసిఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి పండగ కోసం వేతనాలు ఇప్పించిన మంత్రి సత్యవతి రాథోడ్ గారికి తెలంగాణ అంగన్ వాడీ ఉపాధ్యాయులు, ఆయాల సంఘం అధ్యక్షురాలు బిక్షపమ్మ ధన్యవాదాలు తెలిపారు.

మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా అంగన్ వాడీ ఉద్యోగులకు రెండుసార్లు వేతనాలు పెంచిన ఏకైక ప్రభుత్వం తెలంగాణదే అన్నారు. గత పాలకులు వేతనాలు పెంచమని అడిగిన అంగన్ వాడీ ఉద్యోగులను గుర్రాలతో తొక్కిస్తే…తమ ప్రభుత్వం వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుందని చెప్పారు.పండగ కోసం వేతనాలు ఇవ్వమని అడిగిన ఒక్క రోజులోనే నిధులు విడుదల చేసిన మనసున్న మారాజు సీఎం అని మంత్రి కొనియాడారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వమని, మహిళా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వమని మరోసారి నిరూపితమైందన్నారు.

- Advertisement -