హైదరాబాద్ నగర ప్రజలు మెట్రో రైలును ఆహ్వానించిన తీరు అద్బుతమని మంత్రి కేటీఆర్ తెలిపారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో మెట్రోపై రివ్యూ నిర్వహించిన కేటీఆర్ ప్రస్తుతం మెట్రో రైలుకు వస్తున్న భారీ స్పందన నేపథ్యంలో రైళ్ళ సంఖ్యను పెంచేందుకు ఉన్న అవకాశాలను పరిశీంచాలన్నారు. వచ్చే ఫిబ్రవరి నాటికి ప్రయాణీకుల సంఖ్యను బట్టి ఫ్రీక్వెన్సీ ని పెంచుతామని చేస్తామని మంత్రికి హెచ్‌ఎమ్‌ఆర్ అధికారులు తెలిపారు.
మెట్రో ప్రయాణీకులకు అవసరం అయిన పార్కింగ్ సౌకర్యాలపైన మంత్రి ప్రత్యేకంగా చర్చించారు. అవసరం అయిన మేరకు పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటి వరకు ఉన్న పార్కింగ్ ప్రాంతాలను ప్రజలకు తెలిసేలా చర్యలు చేపట్టాలన్నారు. మెట్రో భద్రత చర్యల కోసం పోలీసుల సహకారం తీసుకోవాలని సూచించారు. ప్రజలకు మెట్రో స్మార్ట్ కార్డుల వినియోగం, ప్రయోజనాలు ప్రజలకు మరింత తెలిసేలా అవగాహన కార్యక్రమాలను చేపట్టాలన్నారు. మెట్రో ఫీడర్ల రూట్లలో మరిన్ని బస్సులను ఏర్పాటు చేసేలా అర్టీసి అధికారులతో మాట్లాడుతానని తెలిపారు.
ప్రయాణీకుల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ పైన మంత్రి ఈ సమావేశంలో చర్చించారు. మెట్రో స్టేషన్లలో తాగునీరు, మూత్రశాలల ఏర్పాటుపైన త్వరగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం పరిమితంగా ఉన్న మూత్రశాలలకు అదనంగా మరిన్ని మూత్రశాలల నిర్మాణం తక్షణం చేపట్టాలన్నారు. దీంతోపాటు జూన్ 1 డెడ్ లైన్ పెట్టుకుని ఐటి కారిడార్లో మెట్రో పనులు పూర్తి చేయాలని అధికారులకు అదేశాలు జారీ చేశారు. అమీర్ పేట్ నుంచి హైటెక్ సిటీ రూట్ పై ప్రత్యేక శ్రద్ద చూపాలన్నారు.