తిరుమలలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ అమలు చేస్తున్న QR కోడ్ ఆధారిత పాద రక్షల ట్రాకింగ్ & మేనేజ్‌మెంట్ వ్యవస్థ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తూ విశేష ఫలితాలను అందిస్తోంది. ఆధునిక సాంకేతికతతో అమలులోకి వచ్చిన ఈ విధానం ద్వారా భక్తులు తమ పాద రక్షలను సులభంగా డిపాజిట్ చేసి, తిరిగి వేగంగా పొందగలుగుతున్నారు.
2025 సెప్టెంబర్ నుండి 2026 ఫిబ్రవరి 15 వరకు మొత్తం 8,45,816 పాద రక్షల డిపాజిట్–డెలివరీ లావాదేవీలు ఈ విధానం ద్వారా విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ కాలంలో భక్తుల నుంచి స్వీకరించిన 4,24,047 పాద రక్షల్లో, 4,21,769 పాద రక్షలను సురక్షితంగా తిరిగి అందజేయడం జరిగింది. దాదాపు అన్ని కేంద్రాల్లో పాద రక్షల తిరిగి పొందే శాతం అత్యంత అధికంగా నమోదు కావడం ఈ వ్యవస్థ సమర్థతను ప్రతిబింబిస్తోంది.
వీటిలో ఏటీజీహెచ్ కేంద్రంలో మొత్తం 44,714 పాద రక్షలు సేకరించగా, వాటిలో 44,340 పాద రక్షలు భక్తులకు పంపిణీ చేయబడ్డాయి. కృష్ణ తేజ సర్కిల్ కేంద్రంలో 56,019 పాద రక్షలు సేకరించగా, 55,428 పాద రక్షలు పంపిణీ అయ్యాయి. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో 55,238 పాద రక్షలు సేకరించబడగా, 54,928 పాద రక్షలు భక్తులకు అందించబడ్డాయి. పీఏసీ-5 కేంద్రంలో అత్యధికంగా 1,38,270 పాద రక్షలు సేకరించగా, వాటిలో 1,37,904 పాద రక్షలు పంపిణీ చేయబడ్డాయి. అదే విధంగా రామ్ భగీచ విశ్రాంతి గృహం కేంద్రంలో 76,556 పాద రక్షలు సేకరించగా, 76,071 పాద రక్షలు పంపిణీ అయ్యాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కేంద్రంలో 53,250 పాద రక్షలు సేకరించబడగా, 53,098 పాద రక్షలు పంపిణీ చేయబడ్డాయి.
ప్రత్యేకించి రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో ఈ విధానం భక్తులకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తోంది. ఫిబ్రవరి 1 నుండి 15వ తేదీ వరకు కేవలం 15 రోజుల్లోనే 1,35,314 పాద రక్షల లావాదేవీలు జరగడం ద్వారా రద్దీ సమయాల్లోనూ ఈ వ్యవస్థ ఎంత వేగంగా, క్రమబద్ధంగా పనిచేస్తోందో స్పష్టమవుతోంది.
గతంలో తిరుమలలోని రద్దీ ప్రాంతాల్లో పాద రక్షలు అస్తవ్యస్థంగా పడి ఉండటం, భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించిన టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆ సమస్యలకు పరిష్కారంగా ప్రత్యేక చోరవ తీసుకుని ఈ విధానానికి శ్రీకారం చుట్టారు.
కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ సహకారంతో డిప్యూటీ ఈవో శ్రీ సోమన్నారాయణ ఆధ్వర్యంలో పాద రక్షల నిర్వహణలో పారదర్శకత, క్రమబద్ధత పెరగడంతో భక్తులకు కలిగే ఇబ్బందులు గణనీయంగా తగ్గాయి.
Also Read:కనిపించిన రంజాన్ నెలవంక

