కర్ణాటక ఎన్నికల ఫలితాలు దేశం మొత్తం ఉత్కంఠ రేపాయి. కాంగ్రెస్, జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయనుకుంటే..ఆ రెండు పార్టీలకు షాక్ ఇచ్చింది బిజెపి. రాష్ట్రంలో తమది అతిపెద్ద పార్టీ అంటూ గవవర్నర్ కు లేఖ సమర్పించగా..అందుకు గవర్నర్ అమోదం తెలిపి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిచ్చారు. దీంతో నేడు బిజెపి సీఎం అభ్యర్ధి యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేశారు. ఇందుకు నిరసనగా కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ లు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ తీరును కాంగ్రెస్ పార్టీ ఎండగట్టే ప్రయత్నం చేస్తోంది. రేపు గోవా రాజ్‌భవన్ ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పెరేడ్ నిర్వహించనున్నారు.
బిజెపికి ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత ఎమ్మెల్యేలు లేకున్నా ఎలా అవకాశం ఇస్తారంటూ పలు రాష్ట్రాలలోని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గతేడాది గోవాలో 40స్ధానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాము 17సీట్లు గెలిచి అతిపెద్దపార్టీగా అవతరించామని.. అయినప్పటికి 13 సీట్లు గెలిచిన బిజెపికి గవర్నర్ ఎలా అవకాశం ఇచ్చారని గోవా కాంగ్రేస్ నేత యతీశ్ నాయక్ అన్నారు. కానీ, కర్ణాటకలో మాత్రం అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీనే గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారని, కాబట్టి ఇప్పుడు తమ గవర్నర్ ముందు ఓ డిమాండ్ ఉంచుతున్నామని అన్నారు. గోవాలో ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని అన్నారు. వాళ్లకు ఓ న్యాయం మాకు ఓ న్యాయమా అంటూ కాంగ్రెస్ నేతలు బిజెపిని నిలదీశారు.