ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా పంజాబ్, గోవా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులుదీరారు. గోవా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. గోవాలో 83 శాతం పోలింగ్ నమోదవ్వగా, పంజాబ్ లో 66 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పరికర్ పనాజీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్, మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత దిగంబర్ కామత్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పంజాబ్‌లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో తొలిసారి పోస్టల్ బ్యాలెట్లకు బదులు ఈ-బ్యాలెట్‌ను ఉపయోగిస్తున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, అకాలీదల్ చీఫ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్ బీర్ సింగ్ బాదల్ కేంద్రమంత్రి హర్‌స్మిరాత్ కౌర్ బాదల్ లుంబి నియోజకవర్గం నుంచి ఓటుహక్కునువినియోగించుకున్ఆరు. జలాలబాద్ నుంచి ఆప్ నేత, ఎంపీ జలాలబాద్ ఎంపీ భగవత్ మన్, అమృత్ సర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధి సిద్దూ ఓటు హక్కును వినియోగించుకున్నారు.లంధర్ లోని 66వ నంబర్ పోలింగ్ బూత్ లో ఈవీఎంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పోలింగ్ కొద్దిసేపు నిలిచిపోయింది.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నాయకులు తమదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అమృత్‌సర్‌లో ఓటువేసేందుకు భార్య నవజ్యోత్ కౌర్‌తో కలిసి వచ్చిన క్రికెటర్, కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ పంజాబ్‌లో తమ పార్టీ మళ్లీ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పంజాబ్ ఎన్నికల్లో విజయం సాధించి .. ఆ విజయాన్ని రాహుల్‌గాంధీకి కానుకగా ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ఇది ధర్మయుద్ధమని, ఈ ధర్మయుద్ధంలో తామే విజయం సాధిస్తామని ఆయన చెప్పారు.
గోవాలో 40 స్థానాలకు 251 మంది అభ్యర్థులు, పంజాబ్ 117 స్థానాలకు 1145 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గోవాలో 1,642 పోలింగ్ కేంద్రాలు, పంజాబ్‌లో 22,615 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మార్చి 11న ఫలితాలు వెలువడనున్నాయి. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ లో 79 శాతం, గోవాలో 82.2 శాతం ఓటింగ్ నమోదు అయింది.