తమిళనాడులో అసెంబ్లీలో హైడ్రామా మధ్య సీఎం పళనిస్వామి విశ్వాస పరీక్ష నెగ్గారు. పళనిస్వామికి అనుకూలంగా 122మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. దీంతో ఆయన బలపరీక్షలో నెగ్గినట్లు స్పీకర్ ధన్‌పాల్ ప్రకటించారు. కానీ సభలో ఓటింగ్ జరిగిన తీరును పలువురు రాజకీయవిశ్లేషకులు, సినీ సెలబ్రేటీలు విమర్శిస్తున్నారు. నిన్న తమిళనాడు అసెంబ్లీలో తలుపులు మూసి ఓటింగ్ జరిపిన విషయం తెలిసిందే.
అయితే పళనిస్వామి బలపరీక్ష నేపథ్యంలో అసెంబ్లీలో నిన్న చోటు చేసుకున్న సంఘటనలు రాజ్యాంగానికే సిగ్గుచేటు అంటూ ప్రముఖనటుడు సిద్ధార్థ్ విమర్శించారు. తన ట్వీట్టర్ వేదికగా తమిళనాడు రాజకీయాలపై ఘాటుగా స్పందించాడు. . ‘ఈ రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు నాశనం గాక! ఇదే ప్రస్తుతం రాష్ట్ర ప్రజల మనోగతం. ప్రతిపక్ష హోదాలో డీఎంకే చక్కగా వ్యవహరించింది. చట్టసభలో జరిగింది పిల్లలందరూ చూస్తున్నారన్నది గుర్తించుకొంటే బాగుండేది. ఇది రాజ్యాంగానికే సిగ్గుచేటు’ అని నటుడు సిద్దార్థ్ ట్వీట్టర్‌లో రాసుకొచ్చారు.
అదేవిధంగా శశికళ గురించి కూడా ప్రసావించిన సిద్దార్థ్ జైలులో ఉన్న చిన్నమ్మకు ఒక ల్యాప్‌టాప్ ఇస్తే, వచ్చే నాలుగేళ్లూ చెన్నై నుంచి బెంగళూరు జైలుకి ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామికి రవాణా చార్జిలు మిగుతుతాయని ఎద్దేవా చేశారు. మనం తినే ఆహారంలో కొంచెం ఎక్కువగా ఉప్పు వేసుకొని తినాలి అంటూ పరోక్షంగా తమిళ్లుల్లో పౌరుషం తగ్గిందని వ్యాఖనించాడు.
పళనిస్వామి విశ్వాస పరీక్ష నెగ్గిన అనంతరం ఒక సిద్దార్థే కాదు నటుడు కమల్ హసన్‌కూడా ట్వీట్ చేశారు. తమిళనాడుకు మరో కొత్త సీఎం వచ్చినట్టున్నారంటూ కమల్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లోనే జై డి-మాక్‌క్రేజీ అంటూ కూడా ట్వీట్ చేశారు. డెమోక్రసీ అనే పదాన్ని విడగొట్టేశారు. ఎలా అంటే ప్రజాస్వామ్యం పరిహాసానికి గురైందని, అదో క్రేజీగా మారిందన్న అర్థం వచ్చేలా కమల్ ఆ ట్వీట్ చేశారు. అంతేకాదు తమ తమ ఎమ్మెల్యేలను ఆయా నియోజకవర్గ ప్రజలు గౌరవపూర్వకంగా ఆహ్వానించాలని కూడా మరో ట్వీట్ చేశారు. రాష్ట్రంలోఎక్కువ మంది ప్రజలు పన్నీరు సెల్వమే సీఎం కావాలని ఆశించారని, కానీ తమిళనాడు అసెంబ్లీలో జరిగిన విశ్వాసపరీక్ష తీరు ప్రజాస్వామ్య పరిహాసాన్ని గుర్తుచేస్తున్నదన్న కమల్ తన ట్వీట్టర్‌లో వ్యాఖనించాడు.
రాజకీయాలకు కిలో మీటర్ దూరంలో ఉండే రాధిక కూడా తన ట్వీట్టర్‌లో తమిళనాట రాజకీయాలపై స్పందించింది. తమిళనాడు అసెంబ్లీలో శనివారం చోటు చేసుకున్న సంఘటనలపై గవర్నర్ చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ తన ట్వీట్టర్‌లో పేర్కొన్నారు.
ఇలా శనివారం జరిగిన అసెంబ్లీ తీరుపై పలువురు రాజకీయా నాయకులతో పాటు నటీనటులు కూడా సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.