తమిళనాడు చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావును తొలగిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ఆదేశాలు జారీ చేసింది. గత రెండు రోజుల నుంచి ఆయన ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు జరుగుతుండటం, వాటిల్లో పెద్దఎత్తున నగదు, బంగారం పట్టుబడటంతోనే రామ్మోహన్ రావును తప్పిస్తూ పన్నీర్ సెల్వం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రామ్మోహన్ రావు స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి గిరిజా వైద్యనాథన్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా 1981వ బ్యాచ్ కు చెందిన గిరిజా వైద్యనాథన్. ప్రస్తుతం భూ పరిపాలనా విభాగంలో అదనపు ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
జయలలిత హయాంలో సీఎస్‌గా నియమితులైన రామ్మోహనరావు, ఆయన బంధువులు, స్నేహితులకు చెందిన ఇళ్లపై 13 ప్రాంతాల్లో దాదాపు బుధవారం ఉదయం 5.30 నుంచి గురువారం ఉదయం 6.30 వరకు ఐటీ దాడులు జరగడంతో ఆయన ఇళ్లు, బంధువుల ఇళ్లలో భారీగా నగలు, నగదు, ఆస్తుల దస్తావేజులు స్వాధీనమయ్యాయి. తమిళనాడు చరిత్రలో ఓ సీఎస్‌పై ఐటీ దాడులు జరగటం…పెద్ద ఎత్తున నగదు పట్టుబడటంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశాయి.
దీంతో హుటాహుటిన కేబినెట్ సమావేశం ఏర్పాటుచేసిన పన్నీస్ సెల్వం…రామ్మోహన్ రావును తొలగిస్తు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తొలగించిన రామ్మోహనరావు 1985 బ్యాచ్‌కి చెందినవారు. ఆయన కంటే గిరిజా వైద్యనాథన్ సీనియర్. ఇదిఇలా ఉండగా ఇసుక వ్యాపారి శేఖర్ రెడ్డి అనుచరులనైన ప్రేమ్ కుమార్, రత్నం, రామచంద్రన్ లను పోలీసులు ఈ ఉదయం అరెస్ట్ చేశారు. వీరిని చెన్నై సీబీఐ కోర్టులో హాజరు పరుచగా, జనవరి 4 వరకూ రిమాండ్ విధిస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు.