రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఓటరు లిస్టులో పేరు ధ్రువీకరణ, లేనివారు నమోదు చేసుకోవడం, ఓటు ప్రాముఖ్యత పై ఓటరు అవగాహన,కోవిడ్ ముందు జాగ్రత్త చర్యలు తదితర అంశాలపై అవగాహనా కార్యక్రమాల రూపకల్పన మరియు ప్రచారం కొరకు ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కమిటీలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్, పౌర సంబంధాల అధికారి/ఉప సంచాలకులు పాండురంగారావు, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, జీహెచ్ఎంసీ పౌర సంబంధాల అధికారి/ఉప సంచాలకులు వెంకటేశ్వర్లు సభ్యులుగా ఉన్నారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారధి తెలిపారు.
సోమవారం (2-11-2020) రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలోని సమావేశ మందిరంలో కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ 1-1-2020 తేదీ నాటికి అర్హులైన తాజా అసెంబ్లీ ఓటర్ లిస్టును ప్రామాణికంగా తీసుకుని జీహెచ్ఎంసీ వార్డుల వారీగా విభజించి ఈనెల 7వ తేదీ న ముసాయిదా ఓటరు లిస్టును ప్రచురించడం జరుగుతుందని తెలిపారు.
ఈలోగా అర్హులైన ప్రతి జీహెచ్ఎంసీ ఓటరు తమ ఓటు సంబంధిత అసెంబ్లీ ఓటరు జాబితాలో నమోదై ఉన్నదా లేదా అన్నది ceotelangana.nic.in; nsvp.in వెబ్సైట్ లలో గాని, EPIC కార్డ్ చూపించి E-seva కేంద్రంలో గాని నిర్ధారించుకోవాలని, ఒకవేళ తమ పేరు అసెంబ్లీ ఓటరు జాబితాలో లేనట్లయితే వెంటనే సంబంధిత ఎలెక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (డిప్యూటీ మున్సిపల్ కమిషనర్, హైదరాబాద్, మేడ్చల్ జిల్లా పరిధిలో సంగారెడ్డి, రాజేంద్రనగర్, కందుకూరు రెవిన్యూ డివిజన్ అధికారులు వారి వారి పరిధిలో) వద్ద ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకొన్నచో అర్హులైన వారి పేర్లు అసెంబ్లీ ఓటరు లిస్టులో చేర్చబడి, తదనుగుణంగా సంబంధిత జీహెచ్ఎంసీ వార్డు జాబితాలో చేర్చబడతాయన్నారు. ఈ ప్రక్రియ జీహెచ్ఎంసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయు తేదీ వరకు మాత్రమే జరుగుతుందని తెలియచేసారు. అసెంబ్లీ ఓటరు జాబితాలో తమ పెరు ఉండి 7-11-2020 నాడు ప్రచురింపబడిన వార్డు గాని ముసాయిదా జాబితాలో లేనట్లయితే వ్రాత పూర్వకంగా సంబంధిత డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ గారికి తమ అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, వరుస సంఖ్య వివరాలు తెలుపుతూ దరఖాస్తు చేసుకున్నట్లైతే సంబంధిత జీహెచ్ఎంసీ వార్డు జాబితాలో చేర్చబడతాయన్నారు.
జీహెచ్ఎంసీ గత ఎన్నికల సరళిని పరిశీలించినట్లైతే 45% మించి పోలింగ్ నమోదు కావడం లేదని, ముఖ్యంగా పేద, మధ్య తరగతి ఓటర్లు నివసించే ప్రాంతాలలో ఎక్కువ శాతం పోలింగ్ నమోదు కాగా విద్యాధికులు, ఉన్నత తరగతి ఓటర్లు నివసించే ప్రాంతాలలో తక్కువ శాతం పోలింగ్ నమోదు అవుతుందని, దేశంలోని అతి పెద్ద నగరాల్లో ఒకటైన హైదరాబాద్ నగరానికి సంబంధించిన ప్రజాప్రతినిధులను ఎన్నుకునే ప్రక్రియలో ప్రతిఒక్కరూ పాల్గొనడం సామాజిక బాధ్యత అని, సరైన అభ్యర్థులు ఎన్నుకోబడాలంటే ప్రతిఒక్కరూ వోటింగ్ లో పాల్గొనాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
అలాగే ప్రస్తుత కోవిడ్ తరుణంలో ప్రతిఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నికలలో పాల్గొనాలని, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, ఎప్పటికప్పుడు శానిటైజర్లు ఉపయోగించడం చేయాలని అన్నారు. పై విషయాలపై ప్రతిఒక్కరికీ అవగాహన కలిగించేలా విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు రూపొందించాలని, అందుకు అవసరమైన ప్రణాళికలు వెంటనే రూపొందించాలని కమిటీ సభ్యులకు సూచించారు.