నగరంలో చేపడుతున్న నాలాల పూడిక పనులన్నింటిని జూన్ 7వ తేదీలోపు పూర్తిచేయడంతో పాటు ఈ పనుల పురోగతిని సంబంధిత కార్పొరేటర్లకు తెలియజేయడం, సోషల్ ఆడిట్ నిర్వహించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ ఆదేశించారు. జీహెచ్ఎంసీలో ఇంజనీరింగ్ పనులపై నేడు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. చీఫ్ ఇంజనీర్ జియాఉద్దీన్, సూపరింటెండెంట్, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కమిషనర్ దానకిషోర్ మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్‌లో రూ. 38.25 కోట్ల వ్యయంతో 800.95 కిలోమీటర్ల విస్తీర్ణంలో పూడికతీత పనులను ప్రారంభించామని తెలిపారు. ఇప్పటి వరకు 411 కిలోమీటర్ల నాలాల పూడిక పనుల ద్వారా 2,39,825 క్యూబిక్ మీటర్ల పూడికను తొలగించడం పూర్తయ్యిందని అన్నారు. జూన్ 10వ తేదీన వర్షాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నందున మిగిలిన పూడిక పనులన్నంటిని జూన్ 7వ తేదీ లోపు ఎట్టిపరిస్థితోల్లోనూ పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో సంబంధిత సూపరింటెండెంట్ ఇంజనీర్లు బాధ్యత వహించాలని పేర్కొన్నారు.
జంక్షన్ల వద్ద స్టాప్ లైన్లు, జీబ్రా లైన్ల మార్కింగ్‌ల ఏర్పాటు..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని జంక్షన్ల వద్ద స్టాప్‌లైన్లు, జీబ్రా మార్కింగ్‌ల ఏర్పాటును యుద్ద ప్రాతిపదికపై పెయింటింగ్ చేయించాలని దానకిషోర్ ఆదేశాలు జారీచేశారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా వీటిని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. నగరంలో పలు జంక్షన్ల వద్ద స్టాప్‌లైన్లు, జీబ్రా మార్కింగ్‌లు లేనందువల్ల ట్రాఫిక్ పోలీస్ విభాగం ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించే వారికి విధించే జారిమానాల విషయంలో వివాదాలు ఏర్పడుతున్నందున జూన్ 15వ తేదీలోపు ఈ మార్కింగ్‌లను పూర్తిచేయాలని స్పష్టం చేశారు.
మ్యాన్‌హోళ్లు, క్యాచ్‌పిట్‌ల మరమ్మతులకు ప్రశంసలు..
హైదరాబాద్ నగరంలో రోడ్లకు సమాతారంగా మ్యాన్‌హోళ్లు, క్యాచ్‌పిట్‌లను పునరు నిర్మించేందుకు చేపట్టిన పనులను పట్ల నగరవాసుల నుండి సానుకూల ప్రశంసలు లభిస్తున్నాయని దానకిషోర్ తెలిపారు. నగరంలో జీహెచ్ఎంసీ ద్వారా 3,715 మ్యాన్‌హోళ్లు, క్యాచ్‌పిట్‌లను రోడ్డుకు సమాంతరంగా పనరునిర్మించామని, మిగిలిన 4,013 క్యాచ్‌పిట్‌ల మరమ్మతులు వేగవంతంగా పూర్తిచేయాలని తెలిపారు. ఈ క్యాచ్‌పిట్‌ల మరమ్మతులపై మాజీ మంత్రి కె.టి.రామారావు కూడా అభినందనలు తెలియజేశారని వెల్లడించారు. కాగా సక్రమంగా ఉన్న క్యాచ్‌పిట్‌లు, మ్యాన్‌హోళ్లను కూడా తిరిగి నిర్మిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో క్యాచ్‌పిట్‌ల మరమ్మతులకు ముందు, తర్వాత ఫోటోలను తీసి ఉంచుకోవాలని స్పష్టం చేశారు. ఈ మరమ్మతు పనుల పై అవసరమైతే విజిలెన్స్ విచారణ కూడా జరిపే అవకాశం ఉందని హెచ్చరించారు.
వర్షాకాలంలో ముంపుకు గురికాకుండా చర్యలు..
నగరంలో ఆకస్మిక, భారీ వర్షాల వల్ల 147 ప్రాంతాల్లో నీటి నిల్వలు ఉన్నాయని, వీటిలో 37 ప్రాంతాల్లో నీరు నిల్వకుండా పనులు చేపట్టామని, మిగిలిన 110 ప్రాంతాల్లో ప్రత్యామ్నయ చర్యలు చేపట్టాలని ఇంజనీర్లను కమిషనర్ ఆదేశించారు. రైల్వే అండర్ బ్రిడ్జిలు, వాగులు కలిసే ప్రాంతాలు, మలుపుల వద్ద నీటి నిల్వలు ఏర్పడే ప్రాంతాలుగా గుర్తించామని, ఈ ప్రాంతాల్లో తగు చర్యలు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. గ్రేటర్ పరిధిలో రూ. 390 కోట్ల వ్యయంతో 802 లేన్ కిలోమీటర్ల రోడ్లను పిరియాడికల్ ప్రివెన్షన్ మెయింటనెన్స్ (పి.పి.ఎం) కార్యక్రమంలో భాగంగా చేపట్టిన బీటి కార్పెటింగ్ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని కమిషనర్ ఆదేశించారు. పిపిఎం రోడ్లను సకాలంలో పూర్తిచేయని, ఇప్పటి వరకు పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్ లీస్టులో ఉంచాలని కమిషనర్ ఆదేశించారు. నగరంలో ముందస్తు అనుమతి లేకుండా రోడ్లను అక్రమంగా తవ్వుతున్నారనే అంశంపై జలమండలి, జీహెచ్ఎంసీ ఇంజనీర్ల ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించనున్నట్టు కమిషనర్ తెలిపారు.