గ్రేటర్‌లో శరవేగంగా సీఆర్ఎంపీ రోడ్ల పనులు…

128
ghmc roads

స‌మ‌గ్ర రోడ్ల నిర్వ‌హ‌ణ కార్య‌క్ర‌మం (సి.ఆర్‌.ఎం.పి) కింద చేప‌ట్టిన ప్ర‌ధాన‌ రోడ్ల‌ నిర్వ‌హ‌ణ ప‌నుల‌ను వేగంగా పూర్తిచేసేందుకు కాంట్రాక్ ఏజెన్సీలు లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఏర్ప‌డిన సానుకూల ప‌రిస్థితిని వినియోగించుకుంటున్నాయి. ప‌నుల‌ను కొన‌సాగించుట‌కు ప్ర‌భుత్వం కూడా అన్ని అనుమ‌తుల‌ను జారీచేసింది. లాక్‌డౌన్ పిరియ‌డ్‌లోనే ట్రాఫిక్, ఇత‌ర స‌మ‌స్య‌లు లేనందున పూర్తిస్థాయిలో త‌మ శ‌క్తిని కేంద్రీక‌రించి ప‌నుల‌ను పూర్తిచేయాల‌ని 24 గంట‌ల పాటు ప‌నుల‌ను కొన‌సాగిస్తున్నాయి. త‌ద‌నుగుణంగా ఏప్రిల్ 14లోపు నిర్దేశించిన ప‌నుల‌ను పూర్తిచేసేందుకు నిర్మాణ సంస్థ‌ల‌కు జిహెచ్‌ఎంసి ఇంజ‌నీరింగ్ విభాగం పూర్తి స‌హాయ‌స‌హ‌కారాలు అందిస్తున్న‌ది.

త‌ద‌నుగుణంగా జోన‌ల్ క‌మిష‌న‌ర్ల ఆధ్వ‌ర్యంలో డిప్యూటి క‌మిష‌న‌ర్లు, జిహెచ్‌ఎంసి ఎగ్జిక్యూటీవ్ ఇంజ‌నీర్లు, పోలీసు అధికారుల‌తో ఏర్ప‌డిన బృందాలు ప‌నులు జ‌రుగుతున్న ప్ర‌దేశంలో ప‌రిస్థితుల‌ను మానిట‌రింగ్ చేస్తున్నాయి. ప‌నులు జ‌రుగుతున్న ప్ర‌దేశాల‌కు కార్మికులు, మిష‌న‌రీ, మెటీరియ‌ల్‌, ట్యాంక‌ర్లు, మిక్సింగ్ ప్లాంట్లు చేరుకునేందుకు ఆటంకాలు రాకుండా అనుమ‌తుల‌ను జారీచేస్తున్నాయి. ఇత‌ర జిల్లాలు, రాష్ట్రాల నుండి వ‌చ్చే యంత్రాలు, మెటిరీయ‌ల్ స‌ర‌ఫ‌రా వాహ‌నాల‌కు ఇబ్బందులు త‌లెత్త‌కుండా జిహెచ్‌ఎంసి ఇ.వి.డి.ఎం డైరెక్ట‌ర్ ఆయా ప్రాంతాల పోలీసు అధికారుల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు సంప్ర‌దిస్తున్నారు. సి.ఆర్‌.ఎం.పి రోడ్ల ప‌నుల ప్ర‌గ‌తిని రోజువారిగా జిహెచ్‌ఎంసి క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్ స‌మీక్షిస్తున్నారు. అదే స‌మ‌యంలో ప‌ని ప్ర‌దేశంలో ప‌రిశుభ్ర‌మైన ఆరోగ్య‌క‌ర వాతావ‌ర‌ణాన్ని క‌ల్పించాల‌ని, కార్మికులు, సిబ్బందికి త‌గు ర‌క్ష‌ణ‌ను క‌ల్పించి సామాజిక దూరం పాటించేవిధంగా అధికారులు ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ప‌నిప్ర‌దేశంతో పాటు మిక్సింగ్ ప్లాంట్ల వ‌ద్ద శానిటైజ‌ర్లు ఏర్పాటు చేశారు.

వివ‌రాల్లోకి వెళితే…జిహెచ్‌ఎంసి ప‌రిధిలోని రోడ్ల‌ను అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌కు త‌గ్గ‌ట్టుగా తీర్చిదిద్దాల‌న్న సంక‌ల్పంతో 709 కిలోమీట‌ర్ల పొడ‌వున ఉన్న ప్ర‌ధాన ర‌హ‌దారుల నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ను కాంట్రాక్ట్‌ ఏజెన్సీల‌కు ప్ర‌భుత్వం అప్ప‌గించింది. ఏడు ప్యాకేజీలుగా 401 రోడ్ స్ట్రెచ్‌ల‌ను ఐదు సంవ‌త్స‌రాల పాటు అందంగా తీర్చిదిద్దుట‌కు మ‌ర‌మ్మ‌తుల‌తో పాటు ఆయా రోడ్ల‌లో ఉన్న ఫుట్‌పాత్‌ల‌ను సుంద‌రీక‌రించి సెంట్ర‌ల్ మీడియంల‌ను ఏర్పాటు చేసే బాధ్య‌త కూడా ఏజెన్సీల‌దే. ఈ 709 కిలోమీట‌ర్ల పొడ‌వున పారిశుధ్య‌, మురుగు, వ‌ర‌ద‌నీటి పారుద‌ల నిర్వ‌హ‌ణ‌ను కూడా దేశ‌వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ ఏజెన్సీలే చూస్తాయి. ఐదు సంవ‌త్స‌రాల పాటు 709 కిలోమీట‌ర్ల ప్ర‌ధాన రోడ్ల‌ను అన్ని విధాలుగా నిర్వ‌హించే ప‌నుల‌కు ప్ర‌భుత్వం రూ. 1839 కోట్ల‌ను ఖ‌ర్చు చేస్తుంది. మొత్తం 709 కిలోమీట‌ర్ల‌లో మొద‌టి సంవ‌త్స‌రం 50శాతం, రెండో సంవ‌త్స‌రం 20శాతం, మూడో సంవ‌త్స‌రం 20శాతం రోడ్ల‌ను ప‌టిష్ట‌ప‌రిచి రీకార్పెటింగ్ చేయాలి. త‌దుప‌రి రెండు సంవ‌త్స‌రాల పాటు మొత్తం రోడ్ల‌ను అన్ని విధాలుగా అందంగా ఉంచాల్సిన బాధ్య‌త ఏజెన్సీల‌పై ఉందని జిహెచ్ఎంసి చీఫ్ ఇంజనీర్ జియా ఉద్దీన్ తెలిపారు.ప్రధానమైన ఈ రోడ్లపై అనునిత్యం వాహనాలు, పాదచారుల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. చిన్నపాటి గుంతలు రిపేర్ చేయాలన్నా పోలీసుల సహకారంతో ట్రాఫిక్ మళ్ళిoపు బారికేడ్లు పెట్టి పని చేయాల్సివచ్చేది. లాక్ డౌన్ వలన కార్మికులకు మాత్రమే రక్షణ చర్యలు తీసుకుంటూ, భారీ యంత్రాలతో రోడ్ల రీ కార్పెటింగ్ పనులు చేపట్టారు. పనుల ప్రారంభంలో కొంత జాప్యం జరిగి నప్పటికీ, ఇతర ప్రాంతాలలో కాంట్రాక్ట్ పొందిన అన్నిపనులు నిలిచి వేయడంతో సి ఆర్ ఎం పి పనులపై దృష్ఠి సారించాయి.ఒప్పందం ప్రకారం మొదటి సంవత్సరం నిర్దేశించిన 50 శాతం రోడ్లను రీ-కార్పెటింగ్ కు అవసరమైన మెటీరియల్ ను డంపు చేశాయి.

సి.ఆర్‌.ఎం.పి కింద కాంట్రాక్ట్ ఏజెన్సీలు చేప‌ట్టాల్సిన ప‌నులు:

* మొత్తం 709 కిలోమీట‌ర్ల‌లో మొద‌టి సంవ‌త్స‌రం 50శాతం, రెండో సంవ‌త్స‌రం 20శాతం, మూడో సంవ‌త్స‌రం 20శాతం రోడ్ల‌ను ప‌టిష్ట‌ప‌రిచి రీకార్పెటింగ్ చేయాలి. త‌దుప‌రి రెండు సంవ‌త్స‌రాల పాటు మొత్తం రోడ్ల‌ను అన్ని విధాలుగా అందంగా ఉంచాల్సిన బాధ్య‌త ఏజెన్సీల‌పై ఉంది.

* రోడ్ల‌పై ఉన్న గుంత‌లు పూడ్చివేసి, దెబ్బ‌తిన్న చోట ప్యాచ్‌వ‌ర్క్‌ల‌ను చేయాలి.

* వ‌ర్షాకాలంలో ఏర్ప‌డే అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల‌లో ఈ రోడ్ల‌పై ఎక్క‌డా నీరు నిలువ‌కుండా చ‌ర్య‌లు చేప‌ట్టి నీరు నిలిచే ప్ర‌దేశాల‌ను యుద్ద‌ప్రాతిప‌దిక‌న స‌రిచేసి, శానిటేష‌న్‌తో పాటు యంత్రాల ద్వారా రోడ్ల‌ను ఊడిపించి, ఫుట్‌పాత్‌ల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌హించాలి.

* రోడ్ల నిర్వ‌హ‌ణ‌లో భాగంగా పిరియాడిక‌ల్‌గా లేన్ మార్కింగ్‌, ఫుట్‌పాత్‌లు, సెంట్ర‌ల్ మీడియ‌మ్స్‌, రోడ్ సేఫ్టీ మార్కింగ్‌ల‌ను పెయింటింగ్ చేయించాలి.

* అదేవిధంగా ఫుట్‌పాత్‌ల ప‌క్క‌న, సెంట్ర‌ల్ మీడియంల‌లో గ్రీన‌రీని నిర్వ‌హించాలి.

* వివిధ ప‌నుల నిమిత్తం బి.ఎస్‌.ఎన్‌.ఎల్, వాట‌ర్ వ‌ర్క్స్‌, ఎల‌క్ట్రిసిటీ త‌దిత‌ర శాఖ‌లు చేప‌ట్టే ప‌నుల‌కు అవ‌స‌ర‌మైన రోడ్ క‌ట్టింగ్ అనుమ‌తుల‌ను సి.ఆర్‌.ఎం.పి ఏజెన్సీలే మానిట‌రింగ్ చేస్తాయి.

* జిహెచ్‌ఎంసి జోన‌ల్ క‌మిష‌న‌ర్లు సి.ఆర్‌.ఎం.పి ప‌నుల‌ను రెగ్యుల‌ర్‌గా ప‌ర్య‌వేక్షిస్తారు.

* జిహెచ్‌ఎంసి క్వాలిటీ కంట్రోల్‌, థ‌ర్డ్ పార్టి క్వాలిటీ చెకింగ్ ఏజెన్సీలు ఆయా ప‌నుల నాణ్య‌త‌ను ప‌రిశీలిస్తాయి.