గ్రేటర్ హైదరాబాద్‌లో ట్రాఫిక్ సిగ్నళ్ల నిర్వహణను అత్యంత ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టేందుకు దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో అమలులో ఉన్న ట్రాఫిక్ సిగ్నలింగ్ నిర్వహణను అద్యయనం చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ సూచించారు. గురువారం జీహెచ్ఎంసీ కార్యాలయంలో నగర ట్రాఫిక్ ఇంప్యాక్ట్ అసెస్‌మెంట్ పై జరిగిన సమావేశంలో నిర్ణయించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి.సజ్జనార్, హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ అనిల్‌కుమార్, చీఫ్ ఇంజనీర్లు సురేష్‌కుమార్, జియాఉద్దీన్, శ్రీధర్, హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సి.ఇ మోహన్ నాయక్, సిసిపి దేవేందర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కమిషనర్ దానకిషోర్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం 221 ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయని, హైదరాబాద్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ (హెచ్-ట్రీమ్స్)లో భాగంగా బి.ఇ.ఎల్ వీటిని నిర్వహిస్తుందని అన్నారు. ఈ నవంబర్ మాసాంతానికి నగరంలోని ట్రాఫిక్ సిగ్నళ్ల నిర్వహణ కాంట్రాక్టు గడువును బి.ఇ.ఎల్‌కు ముగుస్తుందని పేర్కొన్నారు. ఇటీవల గ్రేటర్ హైదరాబాద్‌లో ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో వచ్చిన గణనీయమైన ప్రగతి నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా మరో 200 ట్రాఫిక్ సిగ్నళ్లను ఏర్పాటు చేయాలని ఆయా పోలీస్ కమిషనరేట్‌ల నుండి ప్రతిపాదనలు అందాయని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ సిగ్నళ్ల నిర్వహణ సంతృప్తికరంగా లేదని ట్రాఫిక్ పోలీసు అధికారులతో పాటు పలువురు ట్రాఫిక్ రంగ నిపుణులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని, ఈ నేపథ్యంలో బెంగళూర్‌లో ట్రాఫిక్ సిగ్నళ్ల నిర్వహణపై అద్యయనం చేయడంతో పాటు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సిగ్నళ్ల నిర్వహణను చేపట్టిన బి.ఇ.ఎల్ ఉన్నతాధికారులతో సమావేశం కావడానికి జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్‌తో పాటు ట్రాఫిక్ విభాగం ఉన్నతాధికారులతో కూడిన కమిటిని పంపనున్నట్టు దానకిషోర్ తెలియజేశారు.
కమర్షియల్ ప్రాంతాల్లో షాపింగ్ కాంప్లెక్స్‌లు, మల్టీప్లెక్స్‌లు, సినిమా హాళ్ల నిర్మాణానికి అనుమతిచ్చే సమయంలో స్థానిక ట్రాఫిక్ ఇంప్యాక్ట్ అసెస్‌మెంట్‌ను పోలీసు ట్రాఫిక్ విభాగం, ఆర్టీసిలతో చేయించి, ఆయా విభాగాల సూచనల మేరకు అనుమతులు జారీచేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రతిపాదించారు. ముఖ్యంగా పలు రెస్టారెంట్‌లకు సరైన పార్కింగ్ వసతి లేదని సరైన పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించడం, రెస్టారెంట్లకు వచ్చేవారి భద్రతకు విధిగా సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం లాంటి నిబంధనలను కచ్చితంగా పాటించేలా కఠిన నిబంధనలు విధించాలని సూచించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలో గుర్తించిన 16 అత్యంత సమస్యాత్మక ముంపు ప్రాంతాల నివారణకై చర్యలను చేపట్టామని జీహెచ్ఎంసీ నిర్వహణ విభాగం చీఫ్ ఇంజనీర్ తెలిపారు.
ఆగస్టు మాసంలో భారీ వర్షాలు కురుసే అవకాశం ఉన్నందున నగరంలో ఇప్పటికే గుర్తించిన సమస్యాత్మక ముంపు ప్రాంతాల్లో తగు చర్యలు చేపట్టాలని కమిషనర్ దానకిషోర్ ఆదేశించారు. జె.ఎన్.టి.యు మార్గంలో దిగే హైటెక్ సిటీ ఆర్.ఓ.బి అంతమైన మార్గం నుండి రోడ్డు విస్తరణ చేపట్టాలని సైబరాబాద్ ట్రాఫిక్ డి.సి.పి విజయ్‌కుమార్ సూచించారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నిర్వహణ, నియమ నిబంధనలు, నిర్మాణ సంస్థలు చేపట్టాల్సిన చర్యలు, టౌన్‌ప్లానింగ్ విభాగంలో చేయాల్సిన మార్పులు తదితర అంశాలతో కూడిన ట్రాఫిక్ ఇంప్యాక్ట్ అసెస్‌మెంట్ పై లీ-అసోసియేట్స్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.