రాజకీయ దురుద్దేశంతోనే నగర ర్యాంకింగ్‌ను తగ్గించారు- మేయర్

360
mayor
- Advertisement -

సులభతరం జీవనం రాంకింగ్‌లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ హైదరాబాద్ నగరానికి 24 వ స్థానాన్ని ప్రకటించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రకటించారు. ముత్యాల నగరంగా పేరొందిన హైదరాబాద్ నగరం దేశంలోని అన్ని మెట్రో నగరాల కన్నా అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో దూసుకు పోతుందని, ఈ నేపథ్యంలో నగరానికి 24 రాంకింగ్‌ను ప్రకటించడాన్ని హైదరాబాదీయులు అంగీకరించరని మేయర్ స్పష్టం చేశారు.

అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, నాణ్యమైన జీవన ప్రమాణాలు, శాంతి  భద్రతల పరిస్థితులు తదితర ఉన్నత ప్రమాణాలు కలిగిన హైదరాబాద్ నగరాన్ని ఉత్తమ నగరానికి ఉండాల్సిన అన్ని ప్రామాణికాలు ఉన్నాయని పలు అంతర్జాతీయ సర్వేసంస్థలు, ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు ప్రకటించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఈ ర్యాంకింగ్ ల నిర్థారణకు ఉపయోగించిన మెథడాలజి, సమాచారం సేకరించిన ప్రశ్నావళి అసంబద్దంగా ఉందని మేయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ర్యాంక్ లను 79 ఇండికేటర్లను నాలుగు విభాగాలుగా రూపొందించి చేపట్టిన ఈ ర్యాంకింగ్‌లో విద్యా, వైద్య, ఆవాసం, త్రాగునీరు తదితర అంశాలను తెలిపే జీవన ప్రమాణాలకు కేవలం 35 శాతం మార్కులు మాత్రమే ఇవ్వడం, ఆర్థిక ప్రమాణాలకు 15శాతం మార్కులు ఇవ్వడంలో ఔచిత్యం ఏమని ఆమె ప్రశ్నించారు. అత్యంత ప్రాధాన్యత ఉన్న పౌర సేవల విభాగాన్ని ఈ సర్వేలో పేర్కొనలేదని తెలిపారు.

ఆర్థిక పరమైన వివరాలు, టాయిలెట్ల వినియోగం తదితర అంశాలను నేరుగా ప్రజల స్పందన ద్వారా క్షేత్రస్థాయిలో స్వీకరించాల్సి ఉండగా వీటిని ప్రభుత్వ గణాంకాల ద్వారా భేరీజు వేయడం అశాస్రీయమని అన్నారు. కాగా కేంద్ర పట్టణాభివృద్ది మంత్రిత్వ శాఖ ప్రకటించిన ఈ ర్యాంకింగ్ లో విశ్వసనీయత లోపించిందని, మింట్ అనే జాతీయ దినపత్రిక కూడా తప్పుపట్టిందని  మేయర్ గుర్తుచేశారు.

కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించిన ఈ రాంకింగులకు తీసుకున్న 111 నగరాలలో పది లక్షల కన్నా అధిక జనాభా, పదిలక్షల లోపు జనాభా ఉన్న నగరాలను తీసుకున్నారని ఆమె అన్నారు. సులభ తర జీవనం రాంకింగ్ లో పది లక్షల కన్నా అధిక జనాభా కలిగిన నగరాల్లో బెంగళూరు ప్రధమ స్తానంలో, పూణే, అహ్మదాబాద్, చెన్నై నగరాలు తదుపరి స్థానాల్లో నిలిచాయి. పదిలక్షల లోపు జనాభా నగరాల్లో షిమ్లా మొదటి స్థానంలో, భువనేశ్వర్ ద్వితీయ  స్తానంలో నిలిచాయి.

హైదరాబాద్ నగరంలో అనేక బహుళజాతి సంస్థలు, అంతర్జాతీయంగా ఉన్న ప్రముఖ కంపెనీలు తమ కార్యాలయాలను తెరువడం, జె.ఎల్.ఎల్, మెర్సర్స్ లాంటి సంస్థలు హైదరాబాద్ నగరం ఉత్తమ నివాసయోగ్యమైన నగరంగా గత ఐదేళ్లుగా వరుసగా ప్రకటించాయని తెలిపారు. వీటితో పాటు గత ఐదేళ్లుగా హైదరాబాద్ నగరానికి దాదాపు 25 కు పైగా పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు కూడా లభించాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ 24వ స్థానాన్ని ప్రకటించడంలో రాజకీయ దురుద్దేశం ఉందని భావించాల్సి వస్తోందని గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు.

శాంతి భద్రతల విభాగంలో నేషనల్ క్రైమ్ రికార్డర్స్ బ్యూరో (ఎన్.సి.ఆర్.బి) రూపొందించిన  మొత్తం క్రైం రేట్ నివేదికను  పరిగణలో తీసుకోవాల్సి ఉండగా కేవలం మర్డర్ లను మాత్రమే తీసుకున్నారని అన్నారు. మొత్తానికి సులభతర జీవనం ర్యాంకింగ్ నిర్ణారణ మెథడాలజి లో ఉన్న లోపాలను సవరించాలని మేయర్ కేంద్ర పట్టణాభివృద్ది శాఖకు సూచించారు.

గ్రేటర్ హైదరాబాద్ లో గత ఐదేళ్లుగా అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలకు అదనంగా నిరుపేదలు, మురికివాడలు, బస్తీవాసులకు మెరుగైన వైద్య సదుపాయాలను అందించేందుకు 225 కిపైగా బస్తీ దవఖానాలను ఏర్పాటు చేయడం జరిగింది. మెరుగైన రవాణా, సిగ్నల్ ఫ్రీ రహదారుల ఏర్పాటుకు ఎస్.ఆర్.డి.పి ద్వారా పలు ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, లింక్ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని మేయర్ వివరించారు.

బస్తీ దవఖానా:  గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిరుపేదలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు బస్తీ దవఖానాలను ప్రారంభించారు. 2018 లో ప్రారంభమైన ఈ బస్తీ దవఖానాలు ప్రస్తుతం 225 కు పైగా పనిచేస్తున్నాయి. ప్రతి బస్తీ దవఖానాలో సుమారు 80 నుండి 90 మంది ప్రాథమిక చికిత్సకై వస్తున్నారు. ఈ బస్తీ దవఖానలో ఓ.పి సౌకర్యం, టెలీ కన్సల్టేషన్, మౌలిక ల్యాబ్ పరిక్షలు, ఉచిత మందుల సరఫరా, ఇమ్యునైజేషన్ తదితర వైద్య సదుపాయాలను అందిస్తున్నారు.

వ్యూహాత్మక రోడ్ల అభివ‌ృద్ది కార్యక్రమం మొదటి దశలో భాగంగా 26 ప్రధాన రోడ్లను విస్తరించి ఆయా మార్గాల్లో మల్టీలేవల్ ఫ్లైఓవర్లు, ప్రధాన జంక్షన్ల అభివృద్ది చేసి సిగ్నల్ ఫ్రీ ట్రాఫిక్ కు బాటలు వేసింది. దీనిలో భాగంగా 7 స్కై వే లు, 11 మేజర్ కారిడార్ లు, 68 మేజర్ రోడ్స్, 54 గ్రేడ్ సపరేటర్లను చేపట్టింది. వీటిలో రూ. 1010.77 కోట్ల వ్యయంతో 9 ఫ్లైఓవర్లు, నాలుగు అండర్ పాస్ లు, మూడు ఆర్.ఓ.బి/ ఆర్.యు.బి, ఒక కేబుల్ బ్రిడ్జి నిర్మాణాలను పూర్తిచేశారు. రూ. 4741.97 కోట్ల వ్యయంతో మరో 20 అభివృద్ది పనులు పురోగతిలో ఉన్నాయి. రూ. 2310 కోట్ల వ్యయంతో ఐదు ప్రాజెక్ట్ ల డి.పి.ఆర్ లు సిద్దంగా ఉన్నాయి. రోడ్ నెం-45 జూబ్లీహిల్స్, ఎల్బీనగర్ జంక్షన్, నాగోల్ జంక్షన్, బయోడైవర్సిటీ జంక్షన్లకు భూసేకరణ జరిపి వీటి నిర్మాణాలను 2020 లో పూర్తిచేసింది. వీటితో పాటు అంబర్ పేట్, బాలానగర్, ఉప్పల్ రహదారుల విస్తరణను రోడ్లు, భవనాల శాఖ, హెచ్.ఎం.డి.ఏ లతో కలిసి చేపట్టింది.

హరితహారం:  గ్రేటర్ హైదరాబాద్ లో పచ్చదనాన్ని పెంపొందించడం, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు, ఉష్ణోగ్రతలు, పొల్యూషన్ తగ్గింపుకై చేపట్టిన తెలంగాణ కు హరితహారంలో భాగంగా ఇప్పటి వరకు 2,76,97,967 మొక్కలను నాటడం, పంపిణీ చేయడం జరిగింది. 2016 నుండి 2020 వరకు 3 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యానికి గాను 86.28 శాతం మొక్కలు పంపిణీ, నాటడం జరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రెండున్నర కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యానికి గాను 2.08 కోట్ల మొక్కలను పంపిణీ, నాటడం జరిగింది. నగరంలోని 65 ప్రాంతాల్లో యాదాద్రి మోడల్ మియావాకి ప్లాంటేషన్ ను చేపట్టారు. 19 మేజర్ పార్కులు, 17 థీమ్ పార్కులు, 919 కాలనీ పార్కులు, 105 సెంట్రల్ మీడియన్ లు, 66 ట్రాఫిక్ ఐ-లాండ్ లు, 18 ఫ్లైఓవర్లు, 327 ట్రీ ఫార్కులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

రియల్ ఎస్టేట్ పురోగతి: ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం అనంతరం గ్రేటర్ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం గణనీయ పురోగతిలో ఉంది. 2010 నుండి 2014 వరకు జిహెచ్ఎంసి పరిధిలో 733 కమర్షియల్ ప్రాజెక్ట్ ల ద్వారా రూ. 5,72,00,657 ఎస్.ఎఫ్.టి ల  అనుమతులు జారీ కాగా, 2015 నుండి 2019 వరకు 917 ప్రాజెక్ట్ లకు 10,43,55,005 ఎస్.ఎఫ్.టి ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం జరిగింది. 2015 నుండి 2019 దాక 11,024 గృహ నిర్మాణ ప్రాజెక్ట్ లకు అనుమతులు జారీచేశారు. ఇదే కాలంలో 65,953 భవన నిర్మాణ అనుమతులను జారీచేశారు. జిహెచ్ఎంసి పరిధిలో అమలు చేస్తున్న డి.పి.ఎం.ఎస్ విధానానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యేక ప్రశంసలను అందజేసింది.

డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం: నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సంకల్పంతో గ్రేటర్ హైదరాబాద్ పరిదిలో 111 ప్రాంతాల్లో చేపట్టిన లక్ష డబుల్ బెడ్ రూంల నిర్మాణం ముమ్మరంగా సాగుతోంది. ఈ డబుల్ బెడ్ రూం ఇళ్లలో ఇప్పటికే సింగం చెరువు తండా, సయ్యద్ సాబ్ కా బాడా, కిడికి బూద్ ఎలిసా, చిత్తారమ్మ బస్తీ, ఎరుకల నాంచారమ్మ బస్తీ, వనస్థలిపురం రైతు బజార్ లలోని డబుల్ బెడ్ రూం ఇళ్లను లబ్దిదారులకు పంపిణీ చేశారు.

- Advertisement -