ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా పేదలకు ఉచితంగా మెరుగైన వైద్యాన్ని అందించటమే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంకల్పమని జిహెఎంసి మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. ఈ నెల 22న కొత్తగా 45 బస్తీ దవాఖానాలను ప్రారంభిస్తున్న సందర్భంగా దోమలగూడ రోజ్ కాలనీలో కొత్తగా నెలకోల్పుతున్న బస్తీ దవాఖానాలో కల్పించిన వసతులను గురువారం పరిశీలించారు.ఈ సందర్భంగా మేయర్ మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ, ఇతర రాష్ట్రాలలో పేదలకు అందిస్తున్న వైద్య సేవలను అద్యయనం చేసిన ప్రభుత్వం మన నగర ప్రజలు విస్తృతంగా వాడుకలో ఉన్న బస్తీ పదాన్ని జతచేసి బస్తీ దవాఖానాలను నెలకోల్పినట్లు తెలిపారు. బస్తీ ప్రజలు బస్తీ దవాఖానాలను తమదిగా భావిస్తున్నారని పేర్కొన్నారు.
నగరంలో ప్రస్తుతం 85 అర్బన్ హెల్త్ సెంటర్లు, 123 బస్తీ దవాఖానాలు ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 22న మరో 45 బస్తీ దవాఖానాలను ప్రారంభిస్తున్నామని, దీంతో బస్తీ దవాఖానాల సంఖ్య 168కి పెరుగుతుందని తెలిపారు. బస్తీ దవాఖానాలలో వైద్యులు, నర్సులు, ప్యారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటున్నట్లు తెలిపారు. బస్తీ దవాఖానాలలో రక్త నమూనాలు సేకరించి 57 రకాల వ్యాధులకు సంబంధించిన రక్త పరీక్షలు నిర్వహించుటకు తెలంగాణ స్టేట్ డయాగ్నస్టిక్స్‌కు పంపించి వెంటనే రిపోర్టులు తెప్పిస్తున్నట్లు వివరించారు.
అలాగే 150 రకాల మందులను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రతివార్డుకు మూడు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలనే యోచన ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 22న నగర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న కొత్త బస్తీ దవాఖానాల ప్రారంభోత్సవంలో మంత్రులు కెటిఆర్, సబితా ఇంద్రారెడ్డి, టి.హరీష్‌రావు, ఈటెల రాజేందర్, మహ్మద్ మహ్మూద్ అలీ, చామకూర మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, డిప్యూటి స్పీకర్ పద్మారావు, శాసన సభ్యులు, కార్పొరేటర్లు పాల్గొంటారని మేయర్ తెలిపారు.
Inspected one of the 45 basti Dawakhanas that will be inaugurated tomorrow, in Domalguda along with Corporator Lasya Nandita, DC Uma Prakash and AMOH Hemalatha.@KTRTRS @arvindkumar_ias @TelanganaCMO pic.twitter.com/JiBnhIh36A
— Dr. Bonthu Rammohan (@bonthurammohan) May 21, 2020