పంజాగుట్ట శ్మశాన వాటిక పై నుండి రూ. 6 కోట్ల వ్యయంతో 70 మీటర్ల పొడవున స్టీల్ బ్రిడ్జితో పాటు రెండు వైపుల ర్యాంపులను నిర్మించనున్నట్టు నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. 70మీటర్లలో 43 మీటర్ల పొడవు శ్మశానవాటిక స్థలం ఉంటుంది. శ్మశానవాటికను కూడా ఆధునిక వసతులతో అభివృద్ది చేయనున్నట్టు తెలిపారు. భవన నిర్మాణ వ్యర్థాలు, ఇతర చెత్త చెదారం తొలగించి చదును చేయనున్నట్టు తెలిపారు. డ్రైనేజిని క్రమబద్దీకరించాలని చీఫ్ ఇంజనీర్ శ్రీధర్‌ను ఆదేశించారు. నీటి సంరక్షణకు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్‌తో పాటు పాదాచారుల సౌకర్యార్థం వాక్ వేను నిర్మించనున్నట్టు తెలిపారు. స్థానికంగా ఉన్న అడ్డంకులను తొలగించుటకు స్థానిక కుల సంఘాలు, పెద్దలతో చర్చించి, అంగీకరింపచేసినట్లు తెలిపారు.
నగరంలోని శ్మశానవాటికలను జిహెచ్ఎంసి నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. కమిటీలు, సంఘాల పేరున జరిగే అక్రమాలను అరికట్టనున్నట్లు ప్రకటించారు. శనివారం పంజాగుట్టలో నిలిచిన శ్మశానవాటిక పనులను ఖైరతాబాద్ శాసన సభ్యులు దానం నాగేందర్, డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్, స్థానిక కార్పొరేటర్ మన్నె కవితాగోవర్థన్‌రెడ్డి, సి.ఇ శ్రీధర్, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. శ్మశానవాటికకు ప్రహరీగోడ, అప్రోచ్‌రోడ్‌ను నిర్మించనున్నట్టు తెలిపారు.
వివిధ కారణాల వల్ల గత ఆరు నెలలుగా నిలిచిన పనులను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు ఆదేశాల మేరకు తిరిగి కొనసాగించేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపట్టినట్టు తెలిపారు. చట్నీస్ పక్క నుండి నిర్మించే ర్యాంపు నిర్మాణానికి శ్మశానవాటికకు చెందిన కొంత స్థలాన్ని ఉపయోగిస్తున్నందున, దానికి ప్రత్యామ్నాయంగా స్థలాన్ని కేటాయించాలని జాయింట్ కలెక్టర్ రవి, సికింద్రాబాద్ ఆర్.డి.ఓ రాజాగౌడ్‌లను ఆదేశించారు. ఈ మార్గంలో రోడ్డు ఇరుకుగా ఉన్నందున తరుచు ప్రమాదాలు జరుగుతున్నందున, దానిని నివారించుటకు ర్యాంపు నిర్మాణాన్ని చేపడుతున్నట్టు తెలిపారు.