ప్రజలకు మరింత చేరువయ్యేందుకు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది జీహెచ్‌ఎంసీ. స్వరాష్ట్రంలో పాలనలో ప్రజల మన్ననలు పొందుతున్న జీహెచ్‌ఎంసీ స్వచ్ఛతలోనూ దేశంలోని మిగితా మెట్రోపాలిటిన్ సిటీలకు ఆదర్శంగా నిలుస్తోంది. తాజాగా తిండిలేక ఆకలితో అలమటిస్తున్న వారికి ఆహారం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ఈ నెల 14(లవర్స్ డే) నుండి ఫీడ్ ద నీడ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది బల్దియా.
జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉత్పత్తి అవుతున్న చెత్తలో 15 శాతం వరకు ఆహార పదార్థలు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వృధాగా పడేసే ఆహార పదార్థాలను ఇతరులకు అందించడం ద్వారా ఆకలితో పస్తులుండే వారి కడుపులు నింపేందుకు ఫీడ్ ద నీడ్ అనే కార్యక్రమాన్ని ప్రారంబిస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిశోర్ తెలిపారు.
ఇందుకోసం ఓ ప్రత్యేక యాప్‌ని తీసుకురావాలని భావిస్తోంది. దీనికి తోడు ఎన్జీవోల సహకారాంతో ప్రజల్లో అవగాహన తీసుకురావడం,విస్తృతంగా ప్రచారం కల్పించాలని యోచిస్తున్నారు.
ఇప్పటికే శిల్పారామం, జూబ్లీ చెక్ పోస్ట్ సర్కిల్ దగ్గర ఆహారపదార్ధాలను నిల్వ ఉంచడానికి రిఫ్రిజిరేటర్స్ ఏర్పాటు చేశారు. ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజలను ప్రేమిద్దాం… వారి ఆకలి తీరుద్దామని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. జీహెచ్ఎంసీ చేపడుతున్న ఫీడ్ ద నీడ్ అనే కార్యక్రమానికి హోటల్స్ యజమానులు కూడా సహకరించాలన్నారు.ప్రతి ఒక్క హోటల్ ఫుడ్ వేస్ట్ గా పడేయకుండా పేదలకు అందించాలన్నారు.